మా వేగం.. అతి భయానకం!

టీ20 క్రికెట్ అంటేనే వేగం. బ్యాటర్‌ ఎంత త్వరగా అర్ధశతకం చేశాడు? వికెట్ల మధ్య ఎంత చురుగ్గా పరుగెత్తాడు? అన్నదే ఎక్కువగా చూస్తాం. మెరుపు వేగంతో బంతులు విసిరే బౌలర్లను మాత్రం అంతగా పట్టించుకోం! కానీ బుల్లెట్ల మాదిరిగా బంతులు విసిరే బౌలర్లనే జట్లు కోరుకుంటాయి....

Updated : 03 Nov 2020 10:25 IST

విసురుతోంది బంతులా? బుల్లెట్లా?

టీ20 క్రికెట్ అంటేనే వేగం. బ్యాటర్‌ ఎంత త్వరగా అర్ధశతకం చేశాడు? వికెట్ల మధ్య ఎంత చురుగ్గా పరుగెత్తాడు? అన్నదే ఎక్కువగా చూస్తాం. మెరుపు వేగంతో బంతులు విసిరే బౌలర్లను మాత్రం అంతగా పట్టించుకోం! కానీ బుల్లెట్ల మాదిరిగా బంతులు విసిరే బౌలర్లనే జట్లు కోరుకుంటాయి. వారినే ప్రోత్సహిస్తాయి. అందుకే యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్‌ టీ20 లీగులో ఏయే పేసర్లు‌ ఎంత వేగంతో బంతుల్ని సంధించారు? ఎంతగా ఆకట్టుకున్నారో ఓసారి చూద్దామా!


స్పీడ్‌గన్‌తో మొదలు

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా బంతుల్ని సంధించే బౌలర్లుగా షోయబ్‌ అక్తర్‌ (పాక్‌),  బ్రెట్‌ లీ(ఆసీస్)కి పేరుంది. వీరిద్దరూ 100 మైళ్ల వేగంతో అంటే దాదాపుగా 161 కిలోమీటర్ల వేగంతో వేసేవారన్నమాట. లీతో పోలిస్తే అక్తర్‌దే పైచేయి అని కొందరు విశ్లేషకుల మాట. ఇక బీసీసీఐ పొట్టి క్రికెట్‌ లీగులోనూ 2012 నుంచి ఈ రికార్డుల్ని  అందుబాటులో ఉంచుతున్నారు. అప్పట్లో డెక్కన్‌కు ఆడిన దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ 154.4 కి.మీ వేగంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2013లో రాజస్థాన్‌ పేసర్‌ షాన్‌ టైయిట్‌ (153.43‌ కి.మీ) వేగవంతమైన బంతి వేసినా స్టెయిన్‌ రికార్డును చెరపలేదు. 2014లో స్టెయిన్‌ (152.44 కి.మీ), 2015లో మిచెల్‌ జాన్సన్‌ (151.1 కి.మీ), జేసన్‌ హోల్డర్‌ (150.31 కి.మీ), పాట్‌ కమిన్స్‌ (153.56 కి.మీ), జోఫ్రా ఆర్చర్‌ (152.3 కి.మీ) ఆయా సీజన్లలో అత్యంత వేగంగా వేసినా స్టెయిన్‌ రికార్డుకు మాత్రం తక్కువే. అయితే 2019లో మాత్రం కాగిసో రబాడా (154.23) దాదాపుగా తన సహచరుడి‌ వేగాన్ని అందుకున్నాడు.


బద్దలుకొట్టిన నోర్జె

మొన్నమొన్నటి వరకు లీగులో అత్యంత వేగంగా బంతులు విసిరిన రికార్డు స్టెయిన్‌ పేరుతోనే ఉంది. అయితే ఆన్రిచ్‌ నోర్జె (దిల్లీ) ఎప్పుడైతే రంగంలోకి దిగాడో అప్పుడే స్పీడ్‌గన్‌ రికార్డు బద్దలైంది. లీగు చరిత్రలోనే కనీవినీ ఎరగని మెరుపువేగాన్ని అతడు ప్రదర్శించాడు. దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌తో మ్యాచులో జోస్‌ బట్లర్‌కు తన బంతి వేగం.. అతిభయానకం! అని తెలియజేశాడు. ఏకంగా 156.22 కిలోమీటర్ల వేగంతో స్టెయిన్‌ రికార్డును బద్దలుకొట్టేశాడు. 2020లో టాప్‌-5 వేగవంతమైన బంతుల్ని విసిరాడు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో వరుసగా 148.2, 152.3, 152.1, 146.4, 156.4, 155.1కి.మీ వేగం నమోదు చేశాడు. బట్లర్‌ తొలి బంతిని సిక్సర్, 4, 5 బంతుల్ని బౌండరీగా మలిచాడు. అయితే ఆఖరి బంతికి మాత్రం వికెట్లు గాల్లోకి ఎగిరాయి. ఇక మిగిలిన మ్యాచుల్లో నోర్జె 153-154కి.మీ. మధ్యన విసిరాడు.


సైని ఒక్కడే

ప్రస్తుత లీగులో తొలి ఐదు వేగవంతమైన బంతుల్ని నోర్జె విసిరితే తర్వాతి ఐదింటిని జోఫ్రా ఆర్చర్‌ వేయడం గమనార్హం. అతడు వరుసగా 152.55కి.మీ, 153.13, 153.23, 153.36, 153.62 కి.మీ వేగంతో బంతుల్ని నమోదు చేశాడు. అందుకే రాజస్థాన్‌ బౌలింగ్‌ విభాగంలో అతడెంతో కీలకంగా మారాడు. మూడో స్థానంలో కోల్‌కతా పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌ నిలిచాడు. హైదరాబాద్‌తో టై అయిన మ్యాచులో 4-0-15-3తో అదరగొట్టాడు. తక్కువ రన్నప్‌తోనే 152.41కి.మీ, 152.38, 152.36కి.మీ వేగంతో బంతులేసి ఔరా అనిపించాడు. కోల్‌కతాకే చెందిన ప్యా‌ట్‌ కమిన్స్‌ (151.70 కి.మీ), దిల్లీ పేసర్‌ కాగిసో రబాడా (150.99 కి.మీ) ముంబయి పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌ (150.55కి.మీ), బెంగళూరు యువ పేసర్ నవదీప్‌ సైని (149.34 కి.మీ) తర్వాతి స్థానాల్లో నిలిచారు.


ఆర్చర్‌వే 50%

లీగులో 40 మ్యాచులు ముగిసేటప్పటికి నమోదైన 100 వేగవంతమైన బంతుల్ని పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది. ఈ వంద బంతుల్లో భారత బౌలర్లు విసిరింది కేవలం నాలుగంటే నాలుగే. అవీ నవదీప్‌ సైని విసిరనవే. 67, 84, 91, 99వ వేగవంతమైన బంతుల్ని అతడు విసిరాడు. ఇక మిగిలినవన్నీ విదేశీ పేసర్లవే. కమిన్స్‌, రబాడా చెరో 3 వేయగా ప్యాటిన్సన్‌ అయితే ఒకే ఒక్కటి వేశాడు. జోఫ్రా ఆర్చర్‌ 47 బంతులతో అదరగొట్టాడు. ఆన్రిచ్‌ నోర్జె 28, లాకీ ఫెర్గూసన్‌ 14 బంతుల్ని సంధించారు. టాప్‌-100లో దాదాపు 50 శాతం బంతుల్ని ఆర్చర్‌ విసిరాడంటే అతడెంత నిలకడగా వేగాన్ని ప్రదర్శిస్తున్నాడో అంచనా వేయొచ్చు. అందుకే లీగులో అత్యంత విలువైన ఆటగాడిగా అతడే ముందున్నాడు. నోర్జె సైతం ఆర్చర్‌తో పోటీపడుతున్నాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని