Sushil Kumar: సుశీల్‌ ఎలా దాడి చేశాడంటే..!

యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు సుశీల్‌ కుమార్‌ ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎవరెవరిని బంధించాడు? వంటి వివరాలపై స్పష్టత లభిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, సాగర్‌ మిత్రుడు సోనూ మహల్‌ మే 5న సుశీల్‌ ఏం చేశాడో మీడియాకు..

Published : 10 Jun 2021 10:53 IST

మే 5న ఏం జరిగిందో వివరించిన ప్రత్యక్ష సాక్షి

దిల్లీ: యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు సుశీల్‌ కుమార్‌ ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎవరెవరిని బంధించాడు? వంటి వివరాలపై స్పష్టత లభిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, సాగర్‌ మిత్రుడు సోనూ మహల్‌ మే 5న సుశీల్‌ ఏం చేశాడో మీడియాకు వివరించాడు.

మే 5న సుశీల్‌ తనను తీవ్రంగా కొట్టాడని సోనూ చెప్పాడు. ఛత్రసాల్‌ స్టేడియం కోచ్‌ వీరేంద్రను సైతం బయటకు తీసుకెళ్లి కొట్టినట్టు వివరించాడు. ఎందుకంటే ఆయన నంగోలిలో సొంతంగా కోచింగ్‌ కేంద్రం తెరిచారని పేర్కొన్నాడు. ఛత్రసాల్‌ నుంచి 50-60 మంది రెజ్లర్లను సాగర్‌ రాణా అక్కడికి తీసుకెళ్లడం మొదలు పెట్టడంతో సుశీల్‌లో కోపం కట్టలు తెంచుకొందన్నాడు. మే 4, 5 రాత్రుల్లో మునుపెన్నడూ లేనంత ఆగ్రహంతో కనిపించాడని తెలిపాడు. తను, సాగర్ సహా మొత్తం ఐదుగురిని అతడు బయటకు తీసుకెళ్లి బంధించాడని స్పష్టం చేశాడు. బంధీల్లో ఒకరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని వదిలేశాడని వెల్లడించాడు.

‘మే 4 ఉదయం నుంచి సాగర్‌ రాణా కోసం సుశీల్‌ తీవ్రంగా గాలించాడు. నీరజ్‌ భావ్‌నాతో కలిసి ఔటర్‌ దిల్లీ ప్రాంతంలో అమిత్‌, రవీంద్రను బంధించాడు. కారులోనే వారిద్దరినీ బాగా కొట్టారు. భయంతో వారు నాతో పాటు సాగర్‌ ఇంటి చిరునామాలు చెప్పేశారు. సుశీల్‌ అతడి అనుచరులతో కలిసి రాణాను బంధించి కారులో చితకబాదాడు. విడిచిపెట్టిన తర్వాత మేం ఆస్పత్రిలో చేరాం. భగత్‌ సింగ్‌ అనే రెజ్లర్‌నూ సుశీల్‌ బంధించి రాత్రంతా కొట్టాడు. దాంతో అతడి భార్య మే 5 రాత్రి తన భర్తను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని సోనూ వివరించాడు.

‘ఈ విషయం తెలిసి సుశీల్‌.. భగత్‌తో తన భార్యకు వీడియో కాల్‌ చేయించాడు. బాగానే ఉన్నానని, కిడ్నాప్‌ అవ్వలేదని చెప్పించాడు. కానీ అనుమానం వచ్చిన అతడి సతీమణి మళ్లీ పోలీసులకు ఫోన్‌ చేసింది. దాంతో సుశీల్‌ అతడిని విడుదల చేశాడు’ అని సోనూ తెలిపాడు. ఈ దాడిలో సోనూ చేతులు విరిగిపోవడంతో శస్త్రచికిత్స చేయించుకొని కడ్డీ వేయించుకున్నాడు. సాగర్‌ రాణా మరణించాడు. ఆ తర్వాత సుశీల్‌ పరారవ్వడం, పది రోజులకు దొరకడం.. కోర్టు రిమాండ్‌ విధించిండం తెలిసిన సంగతే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని