Faf duplessis: ఫైనల్లో ఆడేందుకు మాకన్నా రాజస్థాన్‌కే ఎక్కువ అర్హత: డుప్లెసిస్

భారత టీ20 లీగ్‌ ఫైనల్లో ఉండేందుకు తమకన్నా రాజస్థాన్‌కే ఎక్కువ అర్హత ఉందని బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్ అన్నాడు...

Published : 28 May 2022 09:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ ఫైనల్లో ఆడేందుకు తమకన్నా రాజస్థాన్‌కే ఎక్కువ అర్హత ఉందని బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్ అన్నాడు. గతరాత్రి జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరినా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన బెంగళూరు కెప్టెన్‌.. ఈ ఓటమి నిరాశ కలిగించినా తమ ఆటగాళ్లు ఈ సీజన్‌లో బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తాము 180 పరుగులు చేసుంటే బాగుండేదని పేర్కొన్నాడు.

‘ఇది బెంగళూరుకు చాలా గొప్ప సీజన్‌. మా ఆటపట్ల గర్వంగా ఉంది. మేం ఎక్కడికివెళ్లినా అభిమానుల మద్దతు కూడా బాగుంది. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సీజన్‌లో మా ఆటగాళ్లు హర్షల్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌, రజత్‌ పటీదార్‌ వంటి వారు అద్భుత ప్రదర్శన చేశారు. కొందరు టీమ్‌ఇండియాకు ఎంపికయ్యారు. వీరితో పాటు మరికొంతమంది నాణ్యమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో మరో 3 ఏళ్ల వరకు మాకు కచ్చితమైన ప్రణాళిక ఉంది. అందుకోసం వీలైనంత మేర కష్టపడతాం. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు మొదట కొంచెం ఇబ్బందిపడ్డా తర్వాత సూపర్‌స్టార్లు అవుతారు. రజత్‌ కూడా అలా మెరిసిన వాడే. టీమ్‌ఇండియాకు ఇప్పుడున్న ఆటగాళ్లతో మూడు జట్లను ఆడించవచ్చు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమితో కచ్చితంగా నిరాశ చెందాం. కానీ, రాజస్థాన్‌ లాంటి మేటి జట్టుతో పోటీపడ్డాం. మాకన్నా ఆ జట్టే ఫైనల్లో ఉండేందుకు ఎక్కువ అర్హత కలిగిఉంది’ అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

మరోవైపు భారత్‌లో క్రికెట్‌కు విశేషమైన ఆదరణ ఉందని, తాము ఎక్కడికి వెళ్లినా అభిమానుల మద్దతు లభించిందని బెంగళూరు కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే లీగ్‌ స్టేజ్‌లో ముంబయి-దిల్లీ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లోనూ అభిమానులు బెంగళూరు పేరు అరుస్తూ కనిపించారని చెప్పాడు. ఒక క్రికెటర్‌కు భారత్‌లో లభించే మద్దతు ఎనలేనిదని పేర్కొన్నాడు. ఇలాంటి ప్రేమాభిమానాలు చూసి ఆశ్చర్యపోతామని తెలిపాడు. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగొస్తామని డుప్లెసిస్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని