CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!

ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ (IPL 2023 Final)ను ఆదివారం రాత్రి మ్యాచ్‌ చూసి ఇంటికి వెళ్లేందుకు చాలా మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే.. వార్షం కారణంగా మ్యాచ్‌ సోమవారానికి వాయిదా పడింది. దీంతో కొంతమంది మ్యాచ్‌ను వీక్షించకుండానే అహ్మదాబాద్‌ నుంచి తిరుగుముఖం పట్టారు. అలాంటి వారిలో ఓ బాధితుడు పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 29 May 2023 17:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎంఎస్ ధోనీని (MS Dhoni) ప్రత్యక్షంగా చూద్దామని ఆశపడిన పదేళ్ల కుర్రాడికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ (CSK vs GT) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది. మ్యాచ్‌తోపాటు ధోనీని దగ్గరగా చూసేందుకు డగౌట్‌కు సమీపంలోని సీట్లను బుక్‌ చేసుకున్నామని, వర్షం వల్ల ఆశలు ఆవిరైనట్లు ఓ అభిమాని పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం రాత్రి మ్యాచ్‌ చూసిన తర్వాత ఇండోర్‌కు వెళ్లిపోవాలని ఓ బిజినెస్‌ మ్యాన్‌ నిర్ణయించుకున్నారు. కానీ, మ్యాచ్‌ వర్షార్పణం కావడం.. రిజర్వే డేకు మారినప్పటికీ పనిఒత్తిడి వల్ల ఇండోర్‌కు తప్పక వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు. 

ఇండోర్‌కు చెందిన  వికాస్ కేడియా తన భార్య, ఇద్దరు పిల్లలతో ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు అహ్మదాబాద్‌కు వచ్చారు. తన పదేళ్ల కుమారుడికి ధోనీని దగ్గర నుంచి చూపించాలని భావించానని, వర్షం వల్ల మొత్తం నిరాశ కలిగిందని పేర్కొన్నాడు. ‘‘వర్షం బోరున పడటంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఆ గుంపులో ఉంటే సురక్షితం కాదనిపించింది. గందరగోళ పరిస్థితులతో పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉందనిపించి ఆందోళన చెందా. చివరికి వారిని తీసుకుని బయటపడ్డా. అయితే వర్క్‌ ఉండటంతో ఇండోర్‌కు బయల్దేరి వచ్చాం. ధోనీని ప్రత్యక్షంగా చూడకుండా వచ్చేస్తుండగా కారులోనే మా పెద్దబ్బాయి ఏడుపు అందుకున్నాడు’’అని కేడియా తెలిపారు. ఇలా కేవలం కేడియాకు మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులకు ఈ పరిస్థితి తలెత్తింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని