బాక్సింగ్‌ డే టెస్టుకు హాజరైన అభిమానికి కరోనా

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన భారత్‌×ఆస్ట్రేలియా రెండో టెస్టుకు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అప్రమత్తమైన మెల్‌బోర్న్‌ ప్రభుత్వ యంత్రాంగం బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు గ్రేట్ సౌథర్న్‌ స్టాండ్‌లో కూర్చున్న...

Published : 06 Jan 2021 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన భారత్‌×ఆస్ట్రేలియా రెండో టెస్టుకు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్‌గా‌ తేలింది. దీంతో అప్రమత్తమైన మెల్‌బోర్న్‌ ప్రభుత్వ యంత్రాంగం బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు గ్రేట్ సౌథర్న్‌ స్టాండ్‌లో కూర్చున్న ప్రేక్షకులను ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. మ్యాచ్‌కు హాజరైన సమయంలో ఆ సదరు వ్యక్తికి కొవిడ్‌-19 సోకలేదని, ఆ తర్వాత మహమ్మారి బారిన పడ్డాడని వెల్లడించింది. కానీ, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా టెస్టులో నెగెటివ్‌ వచ్చేవరకు ఐసోలేషన్‌లోనే ఉండాలని తెలిపింది.

‘‘డిసెంబర్‌ 27న గ్రేట్‌ సౌథర్న్‌ స్టాండ్‌లోని జోన్-5లో మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల సమయంలో కూర్చున్న వీక్షకులు కరోనా టెస్టు చేయించుకోవాలి. నెగెటివ్ వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉండాలి. అయితే బాక్సింగ్‌ డే టెస్టుకు హాజరైన సమయంలో ఆ సదరు వ్యక్తికి కరోనా సోకలేదు. ఆ తర్వాత అతడు మహమ్మరి బారిన పడ్డాడు. అయినప్పటికీ వైద్యశాఖ సూచనల మేరకు కొవిడ్‌ టెస్టులో నెగెటివ్ వచ్చేవరకు ఐసోలేషన్‌లోనే ఉండాలి. బాక్సింగ్‌ డే టెస్టులో ఆట ముగిసిన తర్వాత ప్రతిసారి మైదాన సిబ్బంది స్టేడియాన్ని శానిటైజ్‌ చేశారు’’ అని మెల్‌బోర్న్‌ క్రికెట్ క్లబ్‌ వెల్లడించింది.

ఈ విషయం తెలిసిన అనంతరం సిడ్నీలో జరిగే మూడో టెస్టుపై ఆంక్షలు పెరిగాయి. హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని న్యూసౌత్‌ వేల్స్‌ ప్రభుత్వం సూచించింది. నిబంధనలు అతిక్రమించిన వారు 1000 డాలర్లు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సిడ్నీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మూడో టెస్టుకు 50 శాతానికి బదులుగా 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు నిర్ణయించింది. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి సిడ్నీ వేదికగా భారత్‌×ఆసీస్‌ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

ఇదే మంచి తరుణం

పాఠశాల స్థాయి జట్టుతోనా?ఇదేం ఎంపిక: అక్తర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని