‘ఛీటర్‌ స్మిత్‌’! ఇంకా మారలేదా?

బాల్‌టాంపరింగ్‌ ఉదంతాన్ని పూర్తిగా మరవకముందే ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌‌మన్‌ స్టీవ్ స్మిత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో తన దుర్బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు...

Published : 11 Jan 2021 19:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాల్‌టాంపరింగ్‌ ఉదంతాన్ని పూర్తిగా మరవకముందే ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌‌మన్‌ స్టీవ్ స్మిత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో తన దుర్బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు. పంత్‌ తన బ్యాటింగ్‌కు అనువుగా క్రీజులో చేసుకున్న గార్డ్‌ మార్క్‌ను స్మిత్‌ చెరిపివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సోమవారం ఆటలో రెండో సెషన్‌లో ఆటగాళ్లు డ్రింక్స్‌ బ్రేక్‌కు వెళ్లారు. అయితే ఆ సమయంలో స్మిత్‌ క్రీజు వద్దకు వచ్చాడు. పంత్‌ చేసుకున్న మార్క్‌ను తన షూతో చెరిపివేశాడు. ఇదంతా బెయిల్స్‌ కెమెరాకు చిక్కింది. అయితే దీనిపై మూడో టెస్టు అనంతరం మీడియా సమావేశంలో భారత కెప్టెన్‌ అజింక్య రహానెను ప్రశ్నించగా.. ఆ వీడియోని తాను చూడలేదని, తర్వాత స్పందిస్తానని జింక్స్‌ బదులిచ్చాడు. మరోవైపు ఈ వీడియోను దిగ్గజ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేశాడు. స్మిత్‌ ఎంతో ప్రయత్నించినా, ప్రయోజనం దక్కలేదని తనదైన శైలిలో వ్యంగ్యంగా దానికి వ్యాఖ్య జత చేశాడు.

సిడ్నీ టెస్టులో స్మిత్ చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజాయతీగా ఆడాలని ప్రయత్నించకుండా, విజయం కోసం మరోసారి అడ్డదారులు తొక్కుతున్నావా అని స్మిత్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ స్మిత్, వార్నర్‌పై 12 నెలలు; బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన భారత్×ఆసీస్‌ మూడో టెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

దెబ్బ అదుర్స్‌ కదూ: సెహ్వాగ్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని