Team India: టీమ్‌ఇండియా ఆటగాళ్ల రీల్‌.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు

ప్రపంచక కప్‌ ప్రారంభం కాబోతున్న వేళ టీమ్‌ఇండియా ఆటగాళ్లతో ఒక రీల్‌ షూట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అయితే ఈవీడియోలో కోహ్లీ లేకపోవడంతో ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  

Published : 04 Oct 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రపంచ కప్‌(CWC 2023) మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని దేశాలు ఈ మెగా టోర్నీ కోసం సంసిద్ధమయ్యాయి. పలు జట్లు సన్నాహక మ్యాచ్‌లు సైతం ఆడాయి. ప్రపంచకప్‌ ప్రారంభం నేపథ్యంలో భారత క్రికెట్‌ టీమ్‌(Team India) ఆటగాళ్లతో ఒక రీల్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్టు చేసింది. 360 డిగ్రీ రొటేటింగ్‌ కెమెరాలో ఆటగాళ్లు ఫోజులిచ్చారు. వీరిలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జస్ప్రిత్‌ బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దుల్‌ ఠాకూర్‌, ఇషాన్‌ కిషన్‌ ఉన్నారు. ప్రపంచకప్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఈ రీల్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) లేకపోవడమే. 

ఇన్‌స్టా రీల్‌లో కోహ్లీ లేకపోవడాన్ని అభిమానులు గుర్తించి వెంటనే స్పందించారు. రీల్‌లో కోహ్లీ ఎందుకు మిస్‌ అయ్యాడని ప్రశ్నిస్తున్నారు. ‘‘నేను విరాట్‌ కోసం ఎదురుచూస్తున్నాను కానీ అతడు ఈ వీడియోలో లేడు. ఇలా ఎందుకు జరిగింది’’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. కోహ్లీ లేకుండా ఈ రీల్‌ అసంపూర్తి అని మరో అభిమాని పేర్కొన్నాడు. విరాట్‌ లేకుండా రూపొందిన ఈ వీడియో మసాలా లేని ఆహరమేనని మరో అభిమాని కామెంట్‌ చేశాడు. కింగ్‌ కోహ్లీ ఎక్కడ అంటూ పలువురు ప్రశ్నించారు. తొలి సన్నాహక మ్యాచ్‌ అనంతరం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ ఆడేందుకు కోహ్లీ జట్టుతో పాటు తిరువనంతపురం చేరుకోలేదు. అత్యవసర వ్యక్తిగత కారణాలతో అతడు ముంబయి వెళ్లాడు. 

ఇక ఆట విషయానికొస్తే పలు వార్మప్‌ మ్యాచ్‌లకు వరుణుడు అంతరాయం కలిగించాడు. టీమ్‌ ఇండియా, నెదర్లాండ్స్‌ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దయింది. దీంతో భారత్‌ ఆడాల్సిన రెండు సన్నాహక మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని