Federer: అలాంటి ముగింపే ఉండాలని, అతిగా ఆలోచించొద్దు..!

స్విస్‌ వీరుడు రోజర్ ఫెదరర్‌ తన టెన్నిస్ కెరీర్‌ ముగింపుపై తాజాగా చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వీడ్కోలు ఎప్పుడు ఉత్తమంగా ఉండాలని అతిగా ఆలోచించొద్దన్నాడు.  

Published : 30 Sep 2022 19:14 IST

బెర్న్‌: టెన్నిస్‌ కోర్టులో తనతో కొదమ సింహాల్లా తలపడే నాదల్, జకోవిచ్, ముర్రే వంటి సహచరులు చెంత ఉండగా స్విస్‌ వీరుడు రోజర్ ఫెదరర్ ఆటకు ఘనంగా వీడ్కోలు చెప్పాడు. అయితే నాదల్‌ జోడీగా తన కెరీర్‌ చివరి మ్యాచ్‌లో మాత్రం ఓటమి చవిచూశాడు. అదేకాకుండా పలు విభాగాల్లో చివరగా ఆడిన మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించలేకపోయాడు. ఈ క్రమంలో ఫెదరర్‌ తన టెన్నిస్ కెరీర్‌ ముగింపుపై తాజాగా చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడ్కోలు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని  అతిగా ఆలోచించొద్దన్నాడు.

‘మనమంతా ముగింపు అద్భుతంగా ఉండాలని కోరుకుంటాం. అయితే నా సంగతి ఎలా ఉందో చూడండి. నా చివరి సింగిల్స్‌, డబుల్స్‌, టీమ్ ఈవెంట్‌లో ఓడిపోయాను. ఆ వారంలో నాకు మాటలు కరవయ్యాయి. నా ఆటకు దూరమయ్యాను. ఇలా నా ముగింపు ఉత్తమంగా లేకపోయినా, జరిగిన దానిపట్ల నేను సంతోషంగా ఉన్నాను. అందుకే ఉత్తమమైన ముగింపు గురించి అతిగా ఆలోచించవద్దు. మీ సొంత మార్గం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చాడు.

గతవారం జరిగిన లేవర్‌ కప్ డబుల్స్‌ మ్యాచ్‌లో టీమ్‌ యూరోప్‌ తరఫున ఫెదరర్‌, నాదల్‌.. అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సిస్‌ తియాఫో, జాక్‌ సాక్‌తో తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌, నాదల్‌ జోడీ.. ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌తో ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ముగిసింది. దీంతో మ్యాచ్‌ అనంతరం అతడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. తన ప్రియ సహచరుడైన నాదల్‌తో పాటు తోటి ఆటగాళ్లను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫెదరర్‌ను చూసి తట్టుకోలేక నాదల్‌ కూడా కంటతడిపెట్టాడు. దీంతో కోర్టు ప్రాంగణమంతా ఒక్కసారి ఉద్విగ్నంగా మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తన సహచరుల మధ్య ఫెదరర్‌కు లభించిన వీడ్కోలు అందరిని ఆకట్టుకుంది. దీనిపై ఇటీవల జకోవిచ్ స్పందిస్తూ.. తనకూ అలాంటి వీడ్కోలే కావాలన్నారు. అవి హృదయాన్ని కదిలించే క్షణాలని, ఆ సమయంలో చిరకాల ప్రత్యర్థులు తన పక్కన ఉండాలని కోరుకున్నారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని