ఇంగ్లాండ్‌ జట్టులో రెండు మార్పులు

టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేస్తుందని ఆ జట్టు సారథి జోరూట్‌ పూర్తి నమ్మకంతో ఉన్నాడు...

Published : 12 Feb 2021 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేస్తుందని ఆ జట్టు సారథి జోరూట్‌ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అయితే, తర్వాతి మ్యాచ్‌లో తమ జట్టులో రెండు మార్పులు చేస్తున్నట్లు చెప్పాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన రూట్‌.. శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్‌కు బదులు స్టువర్ట్‌ బ్రాడ్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. అలాగే విశ్రాంతి కోసం స్వదేశానికి వెళ్లిన జోస్‌ బట్లర్‌ స్థానంలో బెన్‌ఫోక్స్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపడతాడని తెలిపాడు. 

ఆర్చర్‌ మోచేతికి గాయమైందని, అతడి స్థానంలో బ్రాడ్‌ను తీసుకున్నామని ఇంగ్లాండ్‌ సారథి చెప్పుకొచ్చాడు. అలాగే ఆటగాళ్లకు తగిన విశ్రాంతి కల్పించాలనే క్రమంలో బట్లర్‌ ఇంటికి చేరుకున్నట్లు వివరించాడు. ఇక్కడి పరిస్థితుల్లో ఎలా ఆడాలి, ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలనే విషయాలపై తమ జట్టులో చర్చించుకున్నట్లు చెప్పాడు. మెల్లిగా పరిస్థితులకు అలవాటు పడుతున్నట్లు కూడా పేర్కొన్నాడు. తొలి టెస్టు విజయ పరంపరను కొనసాగించాలని ఉందన్నాడు. అందుకోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు చెప్పాడు. ఇక బ్రాడ్‌ మేటి బౌలర్‌ అని, అతడు ఇదివరకు ఎలా రాణించాడో ఇప్పుడు టీమ్‌ఇండియాతోనూ అలాగే చెలరేగుతాడని రూట్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, రెండో టెస్టుకు తొలుత అండర్సన్‌కు విశ్రాంతి ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఆర్చర్‌కు గాయమవడంతో అతడు ఆడాల్సి వస్తోందని రూట్‌ పేర్కొన్నాడు.

కాగా, తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 227 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అది రూట్‌కు వందో టెస్టు కాగా, అతడు తొలి ఇన్నింగ్స్‌లో 218, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు సాధించాడు. ఇక శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఎలా ఆడతాడో వేచిచూడాలి. అంతకుముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లోనూ రూట్‌ శతకం, ద్విశతకం సాధించాడు. 

ఇవీ చదవండి..
ఐపీఎల్‌ తుది జాబితాలో 292 మంది ఆటగాళ్లు 
పంత్‌ దెబ్బకు మళ్లీ ఆడతానో లేదో అనుకున్నా

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు