FIFA: ‘బంగారు బూటు’ కోసం మెస్సీ vs ఎంబాపె.. అసలేంటీ ‘గోల్డెన్‌ బూట్’..?

సాకర్‌ విశ్వవిజేత ఎవరన్నది మరి కొద్ది గంటల్లో తేలనుంది. మరి ఈ టోర్నీలో అత్యధిక గోల్స్‌తో బంగారు బూటు దక్కించుకునే ఆటగాడు ఎవరు? ప్రపంచకప్‌ కలను నెరవేర్చుకోవాలని ఆశ పడుతున్న మెస్పీ ఈ గోల్డెన్‌ బూట్ రేసులో ఉండగా.. ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు.

Updated : 18 Dec 2022 19:27 IST

దోహా: ఫిఫా (FIFA) ప్రపంచకప్‌ 2022 మెగా టోర్నీ చివరి దశకు వచ్చేసింది. ఆదివారం జరిగే సాకర్‌ ఫైనల్‌ సమరంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ (France)తో అర్జెంటీనా (Argentina) తలపడనుంది. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ పోరులోనే ‘బంగారు బూటు’ దక్కించునే ఆటగాడు ఎవరో కూడా తేలిపోతుంది. ఈ అవార్డు కోసం ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీ (Lionel Messi), ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె (Kylian Mbappe) ముందు వరుసలో ఉన్నారు. ఇంతకీ ఏంటీ ‘గోల్డెన్‌ బూట్’..? ఈ అవార్డును ఎవరికిస్తారు..?

1982లో తొలిసారి..

1930 నుంచి ఫిఫా ప్రపంచకప్‌ (FIFA Worldcup) టోర్నీలు జరుగుతున్నాయి. అప్పటి నుంచే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్‌ సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రోఫీలు ఇస్తున్నారు. అయితే 1982 ప్రపంచకప్‌ నుంచి ‘గోల్డెన్‌ షూ‌’ పేరుతో ఈ అవార్డులను ఇస్తున్నారు. ఫుట్‌బాల్‌ ఆటగాడు ధరించే బూట్‌ ఆకారంతో ఉండే ఈ ట్రోఫీని ఇత్తడితో చేసి బంగారు పూత పూస్తారు. దీని బరువు దాదాపు కిలో వరకు ఉంటుంది. 2006 ప్రపంచ కప్ నుంచి దీని పేరును ‘గోల్డెన్‌ బూట్‌’ (Golden Boot)గా మార్చారు.

మెస్సీ vs ఎంబాపె..

తాజా టోర్నీలో ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న వారిలో మెస్సీ, ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు. ఈ ఏడాది టోర్నీలో తమ జట్లు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ అగ్రశ్రేణి ఆటగాళ్లు.. చెరో అయిదు గోల్స్‌తో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.

* ఈ టోర్నీలో మెస్సీ ఐదు గోల్స్‌ చేయగా.. మరో మూడింటికి సహకరించాడు. సౌదీ అరేబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, క్రొయేషియాపై ఒక్కో గోల్‌ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కళ్లు చెదిరే గోల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 570 నిమిషాలు ఆడిన మెస్సీ.. మూడు పెనాల్టీ కిక్స్‌ను విజయవంతంగా ఉపయోగించుకున్నాడు.

* ఇక, గోల్డెన్‌ బూట్‌ కోసం పోటీ పడుతున్న ఎంబాపె కూడా ఐదు గోల్స్‌ చేసి.. మరో రెండింటికి సహకరించాడు. ఆస్ట్రేలియాపై 1, డెన్మార్క్‌పై 2, పోలాండ్‌పై 2 గోల్స్‌ చేశాడు. మొరాకోతో జరిగిన సెమీస్‌లో ఎంబాపెకు గోల్‌ దక్కలేదు.

ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్‌ చేస్తే వారికే బంగారు బూటు దక్కుతుంది. ఒకవేళ ఇద్దరూ సమానంగా ఉంటే.. గోల్స్‌కు అసిస్ట్‌ చేసిన సంఖ్య ఆధారంగా అవార్డు ఇస్తారు. ఒకవేళ అది కూడా సమానమైతే.. ప్లేయర్‌ ఆడిన క్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అర్జెంటీనా ఆటగాడు అల్వారెజ్‌, ఫ్రాన్స్‌ ఫుట్‌బాలర్‌ ఒవీర్‌ గిరూడ్ చెరో నాలుగు గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ఆదివారం జరిగే తుది పోరులో తలపడనున్నారు. ఒకవేళ ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ఇద్దరిలో ఎవరైనా.. మెస్సీ, ఎంబాపెను దాటి బంగారు బూటు గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు.

ఏకంగా 13 గోల్స్‌..

ఫిఫా ప్రపంచకప్‌లో తొలి ‘గోల్డెన్‌ షూ’ను 1982లో పాలో రోసీ (ఇటలీ) 6 గోల్స్‌ అందుకున్నాడు. అయితే ఓ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్‌ ఫాంటైన్‌ నిలిచాడు. 1958వ ఎడిషన్‌ టోర్నీలో అతడు ఏకంగా 13 గోల్స్‌ సాధించాడు. ఇక, ఈ టోర్నీ చరిత్రలో ఇంతవరకూ ఏ ఆటగాడు ఒకటి కంటే ఎక్కువసార్లు బంగారు బూటు అందుకోలేదు. కానీ, బ్రెజిల్‌ జట్టు ఆటగాళ్లకు అత్యధికంగా ఆరుసార్లు ఈ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్‌ జాబితాలో రన్నరప్‌లకు  . వెండి, కాంస్య బూట్లను కూడా అందజేస్తారు.

ఈ అవార్డులు కూడా..

‘గోల్డెన్‌ బూట్’తో పాటు ‘గోల్డెన్‌ బాల్’‌, ‘గోల్డెన్ గ్లౌ’ అవార్డులను కూడా ఫిఫా ప్రపంచకప్‌లో అందిస్తారు. ఈ టోర్నీలో ఉత్తమ ఆటగాడికి బంగారు బంతి, ఉత్తమ గోల్‌ కీపర్‌కు బంగారు చేతి గ్లౌజు అవార్డులు ఇస్తారు. ఓటింగ్ ద్వారా ఈ విజేతలను ఎంపిక చేస్తారు.

మరి ‘గోల్డెన్‌ బూట్‌’తో పాటు మెస్సీ ప్రపంచ కప్‌ కల నెరవేరనుందా..? అన్నది తేలాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని