FIFA: రెండు చారిత్రక గోల్స్‌.. ఒకే మ్యాచ్‌: సాకర్‌ మాంత్రికుడు డిగో మారడోనా మాయ

ఫుట్‌ బాల్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయిన రెండు గోల్స్‌ను అర్జెంటీనా దిగ్గజం మారడోనా ఒకే మ్యాచ్‌లో చేశాడు. ఫిఫా ప్రపంచకప్‌లో సూపర్‌ గోల్స్‌ గురించి చెప్పుకోవాలంటే తొలుత ఈ మ్యాచ్‌తోనే మొదలుపెట్టుకోవాలి.

Updated : 21 Nov 2022 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

 ఫుట్‌బాల్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రెండు గోల్స్‌ను 1986 అర్జెంటీనాకు చెందిన దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఒకే మ్యాచ్‌లో కొట్టాడు. ‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’, ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా ఇవి చిరస్థాయిలో నిలిచిపోయాయి. ఫిఫా ప్రపంచకప్‌లో సూపర్‌ గోల్స్‌ గురించి చెప్పుకోవాలంటే తొలుత ఈ మ్యాచ్‌తోనే మొదలుపెట్టుకోవాలి. ఫిఫా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన గోల్‌ ‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’. మెక్సికోలో జరిగిన 1986 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ అర్జెంటీనా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగింది. మ్యాచ్‌ ద్వితీయార్థంలో అర్జెంటీనా బృందం ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ బృందంపై ఎదురుదాడి చేపట్టింది.

ఆరు నిమిషాలు గడిచాక పెనాల్టీ బాక్స్ సమీపంలో తనకంటే ఎత్తుగా ఉన్న ప్రత్యర్థి గోల్‌కీపర్‌ పీటర్‌ షిల్టన్‌ను అడ్డుకొనేందుకు.. మారడోనా గాల్లోకి ఎగిరి బంతిని గోల్‌ పోస్ట్‌ వైపు కొట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆ బంతి మారడోనా తలను తాకడానికి బదులు స్వల్పంగా చేతిని తాకి గోల్‌ పోస్టులో పడింది. ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రూల్స్‌ ప్రకారం ఇది చెల్లదు.  అప్పట్లో వీడియో అసిస్టెంట్‌ రిఫరీ  విధానం లేకపోవడంతో అర్జెంటీనాకు 1-0 ఆధిక్యం లభించింది. ఈ గోల్‌పై మారడోనా స్పందిస్తూ.. ‘‘కొంచెం నా తల.. కొంచెం దేవుడి చెయ్యి’’ కలిసి ఆ గోల్‌ చేశాయని చెప్పాడు. నాటి నుంచి అది ‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌గా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది.

అదే మ్యాచ్‌లో రెండో గోల్‌ కూడా మారడోనానే చేశారు. అది ఏకంగా 100 ఏళ్లలోనే అత్యున్నత గోల్‌గా నిలిచింది. చరిత్రలో దానిని ‘సెంచురీ ఆఫ్‌ ది గోల్‌’గా అభివర్ణిస్తారు.  ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ చేసిన నాలుగు నిమిషాల తర్వాత మరోసారి హెక్టార్‌ ఎన్రిక్‌ నుంచి మారడోనా బంతి అందుకొన్నాడు. దాదాపు 10 సెకన్లపాటు 60 మీటర్లకు పైగా పరిగెత్తి ఇంగ్లాండ్‌ గోల్‌పోస్టు సమీపంలోకి చేరుకొన్నాడు. ఇంగ్లిష్‌ అవుట్‌ ఫీల్డ్‌ ఆటగాళ్లు మారడోనాను అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నం చేశారు. మరో వైపు మారడోనా ఇంగ్లిష్‌ గోల్‌కీపర్‌ పీటర్‌ షిల్టన్‌ను బురిడీ కొట్టించాడు. దీంతో అతడు మందు గానే నేలపై పడి బంతిని అడ్డుకోవాలనుకున్నాడు. అతడిని తప్పించి మారడోనా గోల్‌ చేశాడు. అర్జెంటీనాకు 2-0 ఆధిక్యం లభించింది. ఆ మ్యాచ్‌ను అర్జెంటీనా గెలిచి సెమీస్‌కు.. ఆ తర్వాత ఫైనల్స్‌కు చేరి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని