IND vs SA : వరుణ విజయం.. సిరీస్‌ సమం

తొలి రెండు మ్యాచ్‌ల్లో సొంతగడ్డపై భారత్‌కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా ఓ వైపు.. అద్భుతంగా పుంజుకుని తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ సమం చేసిన భారత్‌ మరోవైపు.. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నిర్ణయాత్మక పోరు మీదకే మళ్లింది. ఓ వైపు వర్షం భయం వెంటాడుతున్నప్పటికీ..

Updated : 20 Jun 2022 06:45 IST

వర్షంతో చివరి టీ20 రద్దు

2-2తో సిరీస్‌ పంచుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా

బెంగళూరు

తొలి రెండు మ్యాచ్‌ల్లో సొంతగడ్డపై భారత్‌కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా ఓ వైపు.. అద్భుతంగా పుంజుకుని తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ సమం చేసిన భారత్‌ మరోవైపు.. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నిర్ణయాత్మక పోరు మీదకే మళ్లింది. ఓ వైపు వర్షం భయం వెంటాడుతున్నప్పటికీ.. ఈ ఆఖరి మ్యాచ్‌లో గెలిచి టీమ్‌ఇండియా సిరీస్‌ గెలుస్తుందా? సఫారీ సేన ట్రోఫీ పట్టుకెళ్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. టాస్‌ పూర్తయింది.. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ మొదలెట్టింది.. కానీ చివరకు విజయం భారత్‌ది కాదు.. సఫారీ సేనదీ కాదు.. వరుణుడిది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దవడంతో రెండు జట్లు సిరీస్‌ పంచుకున్నాయి.

హోరాహోరీగా సాగి.. మలుపులు తిరిగిన భారత్‌, దక్షిణాఫ్రికా అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పేలవ ముగింపు మిగిలింది. విజేతను నిర్ణయించాల్సిన చివరి టీ20 ఆదివారం వరుణుడి దెబ్బకు రద్దయింది. రుతుపవనాల ఆగమనంతో దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ సజావుగా సాగడంపై ముందు నుంచే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ కనీసం కొన్ని ఓవర్ల ఆట సాగి మ్యాచ్‌లో ఓ ఫలితం వస్తుందేమోననే ఆశతో వచ్చిన ప్రేక్షకులతో స్టేడియం నిండిపోయింది. సమయం ప్రకారమే టాస్‌ వేయడం.. అది గెలిచి దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో మ్యాచ్‌ అనుకున్న ప్రకారమే జరుగుతుందని అంతా ఆశించారు. కానీ మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టే సమయంలో వర్షం ముంచెత్తింది. దీంతో 50 నిమిషాలు ఆలస్యంగా పోరు మొదలైంది. ఇన్నింగ్స్‌కు ఒక్కో ఓవర్‌ తగ్గిస్తూ మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. మొదట టీమ్‌ఇండియా 3.3 ఓవర్లలో 28/2 స్కోరు వద్ద ఉన్న సమయంలో మళ్లీ వచ్చిన వరుణుడు ఈసారి తిరిగి వెళ్లలేదు. సిరీస్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన భువనేశ్వర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. గాయం కారణంగా బవుమా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో కేశవ్‌ మహరాజ్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మూడు ఓవర్లు.. రెండు వికెట్లు: వాన కారణంగా పిచ్‌ ఆరంభంలో బౌలర్లకు సహకరించేలా మారింది. దీంతో సఫారీ పేసర్ల పరీక్షను భారత్‌ ఎలా తట్టుకుంటుందో అనిపించింది. కానీ అనూహ్యంగా బౌలింగ్‌ దాడిని స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ (0/16) మొదలెట్టాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఆ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన ఇషాన్‌ కిషన్‌ (15; 7 బంతుల్లో 26) ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చేలా కనిపించాడు. ఆఫ్‌స్టంప్‌పై ఊరిస్తూ వచ్చిన బంతులను ఓ మోకాలు కింద పెట్టి స్లాగ్‌ స్వీప్‌తో అమాంతం స్టాండ్స్‌లో పడేశాడు. కానీ మరో ఎండ్‌లో పేసర్‌ ఎంగిడి (2/6) బంతి అందుకోవడంతో కథ మలుపు తిరిగింది. తన వరుస ఓవర్లలో అతను ఇషాన్‌తో పాటు రుతురాజ్‌ (10)ను వెనక్కిపంపాడు. స్లో డెలివరీలను అంచనా వేయలేక ఓపెనర్లు పెవిలియన్‌ చేరారు. ఇషాన్‌ బౌల్డవగా.. ఆఫ్‌కట్టర్‌ను మిడాన్‌లో గాల్లోకి లేపి రుతురాజ్‌ నిష్క్రమించాడు. ఈ దశలో మళ్లీ చినుకులు వచ్చాయి. క్రీజులోకి వచ్చిన పంత్‌ (1 నాటౌట్‌) ఒక్క బంతి ఎదుర్కోగానే వాన తీవ్రరూపం దాల్చడంతో ఆటగాళ్లు మైదానం వీడాల్సి వచ్చింది. మూడు ఓవర్లు గడిచాయో లేదో కుండపోత వర్షం స్టేడియాన్ని మంచెత్తింది. ఇన్నింగ్స్‌కు కనీసం అయిదు ఓవర్ల చొప్పున మ్యాచ్‌ కూడా నిర్వహించేందుకు ఆస్కారమే లేకుండా పోయింది. అలా జరగాలంటే నిర్ణీత సమయం రాత్రి 10.02 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సింది. కానీ వరుణుడు ఆ అవకాశమే ఇవ్వలేదు. వాన ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇటు అభిమానులు నిరాశ చెందగా.. అటు ప్రేక్షకులు స్టేడియం నుంచి అసంతృప్తితో వెనుదిరిగారు.

భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (బి) ఎంగిడి 15; రుతురాజ్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) ఎంగిడి 10; శ్రేయస్‌ నాటౌట్‌ 0; పంత్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (3.3 ఓవర్లలో 2 వికెట్లకు) 28; వికెట్ల పతనం: 1-20, 2-27; బౌలింగ్‌: కేశవ్‌ మహారాజ్‌ 1-0-16-0; ఎంగిడి 1.3-0-6-2; రబాడ 1-0-5-0


‘‘ఎప్పుడు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కినా అది గర్వపడే సందర్భమే. పైగా టీ20ల్లో బౌలర్‌గా అది లభిస్తే మరింత ప్రత్యేకంగా ఉంటుంది. నా బౌలింగ్‌ లేదా ఫిట్‌నెస్‌ ఏదైనా కావొచ్చు తిరిగి బలంగా పుంజుకోవడంపైనే దృష్టి పెట్టా. కొన్నేళ్లుగా ఆడుతున్నప్పటికీ నా పాత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. పవర్‌ప్లేలో రెండు, చివర్లో రెండు ఓవర్లు వేయాలి. ఇదెప్పుడూ మారదు. కానీ ఓ సీనియర్‌గా యువ ఆటగాళ్లకు సాయం చేయడం కోసం ఆలోచిస్తా. పూర్తి స్వేచ్ఛనిచ్చి నాకు నచ్చింది చేయమని చెప్పిన కెప్టెన్‌ ఉండడం అదృష్టం’’ - భువనేశ్వర్‌

‘‘సిరీస్‌కు ఇలాంటి ముగింపు దొరకడం చిరాగ్గా ఉంది. కానీ ఈ సిరీస్‌లో చాలా సానుకూలాంశాలున్నాయి. ముఖ్యంగా సిరీస్‌లో 0-2తో వెనకబడ్డ సమయంలో మొత్తం జట్టు చూపించిన వ్యక్తిత్వం గొప్పది. మ్యాచ్‌లను గెలిచేందుకు విభిన్న మార్గాలను అన్వేషించాం. సరికొత్త పద్ధతిలో ఆడాలనుకున్నాం. పొరపాట్లు జరుగుతుంటాయి. కానీ మేం సరైన దారిలోనే వెళ్తున్నాం. ఇక ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌లో జట్టు విజయం కోసం నా వంతు సాయం అందించేందుకు ప్రయత్నిస్తా’’ - కెప్టెన్‌ పంత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని