NZ vs IND: మూడో టీ20 టై.. టీమ్‌ఇండియాదే సిరీస్‌

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-0 ఆధిక్యంతో దక్కించుకొంది. నేపియర్‌ వేదికగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా టైగా ముగిసింది. 

Updated : 22 Nov 2022 18:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. భారత ఆటగాళ్లకు వరుణుడూ తోడు కావడంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకొంది. తొలి మ్యాచ్‌ రద్దు కాగా.. రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్‌ డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది. ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌కు అవార్డు దక్కింది.

నేపియర్‌ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ టైగా ముగిసింది. వర్షం కారణంగా మధ్యలోనే మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. 161 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ మ్యాచ్‌ ఆగిపోయే నాటికి 75/4 స్కోరుతో ఉంది. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. నాలుగు వికెట్లతో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకొన్నాడు.

పంత్‌ మళ్లీ విఫలం

బౌలర్లు కష్టపడి కివీస్‌ను 160 పరుగులకే కట్టడి చేసిన ఆనందం కాసేపు భారత అభిమానులకు నిలవలేదు. రెండో టీ20లో అద్భుతంగా ఆడిన ఇషాన్‌ కిషన్‌ (10)తోపాటు రిషభ్‌ పంత్ (11), సూర్యకుమార్‌ యాదవ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మరోవైపు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (30 నాటౌట్: 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో 9 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం రావడం టీమ్‌ఇండియాకి కలిసొచ్చింది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం 76 పరుగులు చేస్తే విజయం.. 75 చేస్తే టైగా ముగుస్తుంది. భారత్‌ సరిగ్గా 75 చేయడంతో ఓటమి నుంచి తప్పించుకొంది. కివీస్‌ బౌలర్లలో సౌథీ 2.. మిల్నే, ఐష్ సోధి చెరో వికెట్‌ తీశారు. 

ఇద్దరే ఆడారు.. ఇద్దరే తీశారు

కివీస్‌ ఆరంభంలోనే ఫిన్ అలెన్ (3) వికెట్‌ను చేజార్చుకొంది. అయితే చాప్‌మన్ (12)తో కలిసి మరో ఓపెనర్ డేవన్ కాన్వే (59) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే చాప్‌మన్‌ను సిరాజ్‌ బుట్టలో వేశాడు. కానీ ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్ (54) వీరవిహారం చేశాడు. కాన్వే-ఫిలిప్స్‌ కలిసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. దీంతో కివీస్‌ స్కోరు 200 పరుగులకు వెళ్తుందేమోనని భారత అభిమానుల్లో కలవరం రేగింది. అయితే సిరాజ్‌ (4/17), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/37) విజృంభించడంతో కేవలం 30 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను కివీస్‌ చేజార్చుకొంది. 

ఇది భారత్‌కు తొలిసారి.. మొత్తంగా మూడోసారి 

వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోయి టైగా ముగియడం భారత టీ20 చరిత్రలో ఇదే తొలిసారి. అయితే అంతర్జాతీయంగా మాత్రం మూడో మ్యాచ్‌ కావడం గమనార్హం. గతేడాది (2021) నెదర్లాండ్స్ X మలేషియా... మాల్టా X మార్సా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలా టైగా ముగిశాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని