చారిత్రక విజయానికి అడుగు దూరంలో.. భారత్‌

 సుధీర్ఘ టెస్టు సిరీస్‌ తుది అంకానికి చేరుకుంది. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో కోహ్లీసేన ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టులోనూ ప్రత్యర్థి జట్టును సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర..

Published : 10 Sep 2021 01:57 IST

మాంఛెస్టర్‌ : సుదీర్ఘ టెస్టు సిరీస్‌ తుది అంకానికి చేరుకుంది. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో కోహ్లీసేన ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టులోనూ ప్రత్యర్థి జట్టును సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఎలాగైనా ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్‌ జట్టు. భారత్‌ చరిత్ర సృష్టిస్తుందో.. ఇంగ్లాండ్‌ సిరీస్‌ను సమం చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!

సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌.. చివరి మ్యాచ్‌లో పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే, నాలుగు టెస్టుల్లో కలిపి 151 ఓవర్లు విసిరి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను.. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా అతడిపై మరింత భారం వేయకుండా చివరి మ్యాచుకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అలాగే, ఫామ్‌లేమితో సతమతమవుతున్న వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెను పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. చివరి అవకాశంగా భావించి మరోసారి రహానెను ఆడించినా.. విఫలమైతే అతడి అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడినట్టే. 33 ఏళ్ల రహానెను జట్టు నుంచి తప్పిస్తే భవిష్యత్‌లో మళ్లీ టెస్టు క్రికెట్‌ ఆడే అవకాశాలు తక్కువే. ఇప్పటికే, ఎంతో మంది యువ ఆటగాళ్లు ఒక్క అవకాశం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రహానెను పక్కన పెడితే అతడి స్థానంలో యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ లేదా హనుమ విహారిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 

మరో పేసర్‌ మహమ్మద్‌ షమి ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంతో.. తుది జట్టులో కచ్చితంగా ఆడే అవకాశం ఉంది. అయితే, ప్రధాన కోచ్‌ రవి శాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ కరోనా బారిన పడటంతో.. తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయంపై ఆధార పడి ఉంది. గత మ్యాచులో ఆరు వికెట్లతో ఆకట్టుకున్న ఉమేశ్ యాదవ్‌, ఆల్ రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన శార్ధూల్‌ ఠాకూర్‌ల స్థానాలకు ఢోకా లేదు. ఇక గత నాలుగు మ్యాచుల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ కూడా ఈ మ్యాచులో ఆడే అవకాశం ఉంది. ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. 

నాలుగో టెస్టులో పరాజయానికి దీటుగా బదులివ్వాలనే కసితో ఇంగ్గాండ్‌ బరిలోకి దిగనుంది. బెయిర్‌ స్టో స్థానంలో జట్టులోకి వచ్చిన జోస్‌ బట్లర్‌కి వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గత మ్యాచుకు దూరం పెట్టిన మార్క్‌ వుడ్‌తో, క్రిస్ వోక్స్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. జేమ్స్ అండర్సన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నారు.

శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచుకు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. తొలి రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కురిసి మ్యాచ్‌ రద్దయితే.. సిరీస్‌ భారత్‌ వశమవుతుంది. అదేగనుక జరిగితే ఆస్ట్రేలియా (2018-19), ఇంగ్లాండ్‌(2021)ల్లో టెస్టు సిరీస్‌ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు. 

జట్లు..
టీమిండియా : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, మయాంక్ అగర్వాల్‌, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఇశాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్, వృద్ధిమాన్‌ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌, శార్థూల్ ఠాకూర్‌.

ఇంగ్లాండ్‌ : రోరీ బర్న్స్‌, హసీబ్‌ హమీద్‌, మొయిన్‌ అలీ, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, జోస్‌ బట్లర్‌, డాన్‌ లారెన్స్‌, ఓలీ రాబిన్సన్‌, సామ్‌ కరన్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, జాక్‌ లీచ్‌, ఓలీ పోప్‌, డేవిడ్‌ మలన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని