T20 World Cup: ఆసీస్‌ వార్మప్‌ మ్యాచ్‌తో..  టీమిండియా తుది జట్టు కుదిరేనా?

ంతఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్న భారత క్రికెట్ జట్టు

Updated : 20 Oct 2021 13:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు. అదే ఊపులో బుధవారం ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. పొట్టి ప్రపంచకప్‌ వేటను 24న పాకిస్థాన్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌తో టీమిండియా ప్రారంభించనుంది. దీంతో ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆర్డర్‌ను సరి చేసుకోవడానికి టీమిండియాకు ఇదొక సదవకాశం.

మొదటి వార్మప్‌ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేశారు. ఇద్దరూ అర్ధశతకాలు సాధించి మంచి ఫామ్‌ను కనబరిచారు. విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య ధాటిగా ఆడకపోయినా.. రిషభ్‌ పంత్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ విఫలమైనా నిరూపించుకునేందుకు మరొకసారి అవకాశం ఇవ్వొచ్చు. జడేజా, అశ్విన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి వార్మప్‌ మ్యాచ్‌లో ప్రతి బ్యాటర్ రాణిస్తే పాక్‌తో తుది జట్టును ఎంచుకోవడం కోహ్లీకి కత్తిమీద సామే.


ఓపెనింగ్‌ ఎవరో..?

ఆసీస్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ ఎవరు చేస్తారనే దానిపైనా సందిగ్ధత నెలకొంది. ఇంగ్లాండ్‌తో తొలి వార్మప్‌లో సీనియర్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ తుది జట్టులో లేడు. కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడి పరుగులు రాబట్టారు. ఇప్పుడు ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌లో రోహిత్‌ తప్పనిసరిగా ఆడతాడు. రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్‌ చేసే అవకాశం లేకపోలేదు. అయితే స్పెషలిస్టులు ఉన్న నేపథ్యంలో విరాట్ మూడో స్థానంలో వచ్చేందుకు మొగ్గు చూపుతాడు. రోహిత్‌తో పాటు కేఎల్‌ రాహుల్, ఇషాన్‌ కిషన్‌ను తీసుకోవాలంటే మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ను తప్పించాల్సి ఉంటుంది. తొలి వార్మప్‌లో ఆశించిన మేర రాణించకపోయిన సూర్యకుమార్‌కు మరొక అవకాశం ఇస్తే నిరూపించుకునేందుకు వీలుంటుంది. భారత్‌కు హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా రూపంలో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే హార్దిక్ పాండ్య బౌలింగ్‌ చేయకపోవడం కాస్త సమస్యగా మారే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు కూడా హార్దిక్‌ ఇబ్బందిపడ్డాడు. అయినా మ్యాచ్‌ ఫినిషర్‌గా గుర్తింపు ఉన్న హార్దిక్‌ను కొనసాగించేందుకే కోహ్లీ మొగ్గు చూపుతాడు.


బౌలింగ్‌లోనూ ఆప్షన్స్‌.. 

భారత్‌కు భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌ రూపంలో అత్యుత్తమ ఫాస్ట్‌బౌలింగ్ దళం ఉంది. అలానే అశ్విన్‌, జడేజా, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో పరుగులను నియంత్రించడంలో బుమ్రా, అశ్విన్‌ ఫర్వాలేదనింపించారు. షమీ మూడు వికెట్లు పడగొట్టినా... ధారాళంగా పరుగులు ఇచ్చాడు. భువనేశ్వర్‌, రాహుల్ చాహర్‌ అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆసీస్‌తో జరగనున్న వార్మప్‌ మ్యాచ్‌లో శార్దూల్‌, వరుణ్‌ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. శార్దూల్‌ చేరికతో అదనంగా బ్యాటర్‌ కూడా వచ్చినట్టు అవుతుంది. హార్దిక్‌ బదులు శార్దూల్‌ను తీసుకోవాలని అనుకుంటే... ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ బ్యాటు బలం చూపించాల్సిందే. ఈ వార్మప్‌ మ్యాచ్‌లో ఎంత త్వరగా బ్యాటర్లు, బౌలర్లు సెట్‌ అయితేనే.. పాకిస్థాన్‌పై ఆధిపత్యం కొనసాగించేందుకు వీలు కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని