Updated : 20 Feb 2022 10:31 IST

Sakibul Gani : ఈ ‘గని’ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు..

ఇంటర్నెట్ డెస్క్‌, ప్రత్యేకం : క్రికెట్‌లోకి అడుగు పెడుతూనే సంచలనంగా మారాలని ప్రతి క్రికెటర్ భావిస్తాడు. తొలి మ్యాచ్‌లోనే తన మార్క్‌ను చూపించాలని తహతహలాడతాడు. జాతీయ జట్టులోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి మ్యాచ్‌ అనగానే కాస్త కంగారు పడటం మామూలే. అయితే బిహార్‌కు చెందిన ఓ కుర్రాడు మాత్రం అరంగేట్ర మ్యాచ్‌లోనే త్రిశతకం సాధించి ప్రపంచ రికార్డును స్థాపించాడు. ఇంతకీ ఎవరా యువ ఆటగాడు.. అతడి గురించి ప్రత్యేక కథనం మీ కోసం..

సకిబుల్‌ గని.. ఈ 23 ఏళ్ల యువకుడి పేరు నిన్నటి నుంచి మార్మోగిపోతోంది. ఎందుకో తెలుసా.. అంతర్జాతీయంగా తన మొదటి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లోనే త్రిశతకం బాదిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బిహార్‌కు చెందిన సకిబుల్‌ గని మిజోరం జట్టుపై 405 బంతుల్లో 341 పరుగులు (56 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి చరిత్ర సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆ ఘనత అందుకున్న మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా గత రికార్డు కూడా భారత క్రికెటర్‌ పేరు మీదే ఉంది. 2018లో మధ్యప్రదేశ్‌ ఆటగాడు అజయ్‌ రొతేరా హైదరాబాద్‌పై 267 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును సకిబుల్‌ తిరగరాశాడు. అయితే దీని వెనుక కఠోర శ్రమ, కోచ్‌ అజయ్‌ రాత్రా, సోదరుడు ఫైజల్‌ గని సహకారం ఉంది. 

కోచ్‌ రాత్రా గుర్తించడంతో... 

2018-19 సీజన్‌లో సీకే నాయుడు ట్రోఫీ కోసం సెలెక్షన్‌ జరుగుతోంది. అప్పుడు టీమ్‌ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ అజయ్‌ రాత్రా బిహార్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘పట్నాలోని మొయిన్‌ ఉల్ హక్ స్టేడియంలో మొదటసారి గని ఎలాంటి భయం లేకుండా స్ట్రోక్‌ప్లే ఆడటం చూశా. క్లాసైన ఆటను ఆడుతున్నాడు. వెంటనే స్థానిక మ్యాచుల్లో అతడి స్కోరు వివరాలను పరిశీలించా. అతడు టాప్‌ఆర్డర్‌ నుంచి ఆరో స్థానం వరకు బ్యాటింగ్ చేయగలడు’’ అని రాత్రా వివరించారు. ఆ సీజన్‌లో 57.08 సగటుతో 685  పరుగులు చేసి బిహార్‌ అండర్‌-23 జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడన్నారు. ‘ఆ సీజన్‌లో అతడు వెయ్యికిపైగా పరుగులు చేస్తాడని భావించా. కొన్నిసార్లు 30 లేదా 40 పరుగులకే అనవసరంగా వికెట్‌ను సమర్పించుకునేవాడు. క్రీజ్‌లో ఎక్కువ సమయం ఉండాలని మాత్రమే సూచించా. అయితే వయసు ప్రభావంతో కాస్త దూకుడుకు పోయి వికెట్‌ ఇచ్చేవాడు’’ అని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాత్రా అసోం రంజీ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. ఇప్పటికీ మేమిద్దరం టచ్‌లోనే ఉన్నామని, ఇలాంటి ఫీట్‌ను గని సాధించడం ఎంతో ఆనందంగా ఉందని రాత్రా తెలిపారు.

తండ్రి వద్దని వారించినా.. సోదరుడి తోడ్పాటుతో 

సకిబుల్‌ గనికి తండ్రి మహమ్మద్‌ మనన్‌ గని నుంచి ప్రతిఘటన తప్పలేదు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవద్దని వారించేవారు. అయితే సకిబుల్ సోదరుడు ఫైజల్ గని మాత్రం ప్రోత్సహిస్తూ అండగా నిలిచారు. ఫైజల్‌ గని కూడా రాష్ట్రస్థాయి క్రికెటర్‌. సకిబుల్‌లోని టాలెంట్‌ను కోచ్‌ అజయ్ రాత్రా గుర్తించి మంచి వేదికను అందిస్తే.. తమ్ముడి ఎదుగుదలకు ఫైజల్‌ గని ఎంతో తోడ్పాటునందించారు. ‘‘ స్వతహాగా నేనూ క్రికెటర్‌నే. 2009-10 సీజన్‌లో బిహార్‌ తరఫున కూచ్‌ బెహర్ (అండర్-19) ట్రోఫీ ఆడాను. అదేవిధంగా విజ్జీ ట్రోఫీకి ఈస్ట్‌ జోన్‌ సారథిగా బాధ్యతలు నిర్వర్తించా. అయితే బిహార్‌లో క్రికెట్‌కు భవిష్యత్తు లేకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికేశా. నేను ఆపేసినా నా సోదరుడు ఒక్క ట్రైనింగ్‌ సెషన్‌ను కూడా మిస్‌ కాకూడదని భావించా. అందుకే అతడిని రాంచీ పంపించి ఝార్ఞండ్‌ తరఫున ఆడించేందుకు నిర్ణయం తీసుకున్నా’’ అని 29 ఏళ్ల ఫైజల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఫైజల్‌  మోతిహరిలో స్పోర్ట్స్‌ షాప్‌ను నడిపిస్తున్నారు. 

ఇదీ కుటుంబ నేపథ్యం.. 

సకిబుల్‌ తండ్రి మహమ్మద్‌ మనన్‌ గని ఓ రైతు. ఆయనకు నలుగురు కుమారులు. అందులో సకిబుల్‌ చివరివాడు. గని సోదరులందరూ ఏదొక స్థాయి వరకు క్రికెట్‌ ఆడినవారే కావడం విశేషం. ‘‘ మాకు కాస్త పొలం ఉంది. దీంతో మా నాన్న అందరూ చదువుకోవాలని చెప్పేవారు. లేకపోతే ఆయనకు వ్యవసాయ పనుల్లో సహాయం చేయాలనేవారు. దానికీ ఆయన వద్ద కారణాలు ఉన్నాయి. బిహార్‌ తరఫున క్రికెట్‌లో రాణించినవారి పరిస్థితి గురించి చాలా విన్నారు’’ అని ఫైజల్‌ గని తెలిపారు. సకిబుల్‌ ప్రదర్శనను గమనించిన దిల్లీ క్యాపిటల్స్‌ పరీక్షించేందుకు ముంబయికి రావాలని సూచించింది. అయితే ఐపీఎల్‌ ఆక్షన్‌లో సకిబుల్‌ పేరు నమోదు కాలేదు. దీనికి ఎలాంటి బాధ లేదని, ట్రయల్స్‌ కోసం డీసీ పిలవడం సకిబుల్‌ను ఎంతో ఆనందానికి గురి చేసిందని ఫైజల్‌ వివరించారు. తాము ఎప్పటికీ అజయ్‌ రాత్రా సర్‌కి రుణపడి ఉంటామని, వ్యక్తిగతంగా ఆసక్తి చూపి మరీ సకిబుల్‌ బ్యాటింగ్‌లోని లోపాలను సరిదిద్దారని ఫైజల్‌ పేర్కొన్నారు.

గనిని అభినందించిన సచిన్‌

ప్రపంచ రికార్డును నమోదు చేసిన సకిబుల్ గనిని క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అభినందించాడు. ‘కంగ్రాట్స్ గని.. అరంగేట్రంలోనే రంజీ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశావు. అలాగే కొనసాగు’’ అని ట్వీట్ చేశాడు.Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని