IND vs AUS: భారత్‌ X ఆసీస్‌.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో భాగంగా తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ (IND vs AUS) పైచేయి సాధించే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 177 పరుగులకే ఆలౌట్‌ చేసింది. రవీంద్ర జడేజా (Ravindra Jadeja), అశ్విన్ (Ashwin) బౌలింగ్‌లో అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ (Team India) నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అర్ధశతకం సాధించాడు. 

Updated : 09 Feb 2023 17:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ (IND vs AUS) మొదటి రోజు ఆట ముగిసింది. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి  77 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (56*) (Rohit Sharma) దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో అర్ధశతకం బాదాడు. తొలి రోజు మరో ఏడు బంతుల్లో ముగుస్తుందనగా.. కేఎల్ రాహుల్‌ (20) మర్ఫీ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్‌ అయ్యాడు. దీంతో 76 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్‌లో రోహిత్‌తోపాటు  నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. 

జడ్డూ మాయ.. అశ్విన్ అనుభవం

నాగ్‌పుర్ పిచ్‌ స్పిన్‌కు అనుకూలమని అంతా అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా భారత పేసర్లు షమీ (1/18), సిరాజ్‌ (1/30) ఆరంభంలోనే ఆసీస్‌ ఓపెనర్లు ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1)ను ఔట్‌ చేసి టీమ్‌ఇండియాకు బ్రేక్‌ ఇచ్చారు. ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దింపిన కెప్టెన్‌ రోహిత్ ఫలితం రాబట్టాడు. లబుషేన్ (49: 123 బంతుల్లో), స్టీవ్‌ స్మిత్ (37: 107 బంతుల్లో) కాసేపు అడ్డుపడినా.. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్‌ 200లోపే కుప్పకూలింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా (5/47) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. అశ్విన్ (3/42) దెబ్బకు ఆసీస్ హడలెత్తిపోయింది. 

రెండో రోజు నిలబడితే చాలు.. 

కాస్త  ఓపికగా క్రీజ్‌లో నిలబడటంతోపాటు అవసరమైన సందర్భంలో దూకుడు ప్రదర్శిస్తే మాత్రం పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికే లబుషేన్, స్టీవ్‌ స్మిత్, అలెక్స్‌ క్యారీతోపాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరూపించారు. ఇంకా మరో 100 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్న టీమ్‌ఇండియా రెండో రోజు మొత్తం బ్యాటింగ్‌ చేస్తే తొలి టెస్టులో పై చేయి సాధించడం కష్టమేం కాదు. ఆసీస్‌పై కనీసం 200 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధిస్తే మాత్రం భారత్‌ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాకపోవచ్చు. తొలి రోజే స్పిన్‌కు అనుకూలంగా మారిన నాగ్‌పుర్ పిచ్‌.. గడిచే కొద్దీ స్పిన్నర్ల పాలిట స్వర్గధామంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు క్రీజ్‌లో ఉన్నవారే కాకుండా విరాట్, ఛెతేశ్వర్ పుజారా, సూర్యకుమార్‌, రవీంద్ర జడేజా, భరత్, అక్షర్ బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని