balloon game: బెలూన్‌ వరల్డ్‌ కప్‌ గురించి విన్నారా..!

బెలూన్‌తో రకరకాల ఆటలు ఆడుతుంటాం. దాన్ని కింద పడకుండా చేతుల్తో పైపైకి ఎగేరవేయడం అందులో ఒకటి. మీరూ అలాంటి సరదా ఆట ఆడే ఉంటారు కదా..! అయితే, ఇప్పుడు ఆ సరదా ఆటే.. అంతర్జాతీయ క్రీడగా మారిపోయింది. తాజాగా స్పెయిన్‌లో బెలూన్‌ ప్రపంచ కప్‌

Updated : 19 Oct 2021 06:02 IST


(ఫొటో: బెలూన్‌ వరల్డ్‌ కప్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెలూన్‌తో రకరకాల ఆటలు ఆడుతుంటాం. దాన్ని కింద పడకుండా చేతుల్తో పైపైకి ఎగేరవేయడం అందులో ఒకటి. మీరూ అలాంటి సరదా ఆట ఆడే ఉంటారు కదా..! అయితే, ఇప్పుడు ఆ సరదా ఆటే.. అంతర్జాతీయ క్రీడగా మారిపోయింది. తాజాగా స్పెయిన్‌లో బెలూన్‌ ప్రపంచ కప్‌ పోటీలు జరగగా.. పెరూకు చెందిన క్రీడాకారుడు ఛాంపియన్‌గా నిలిచాడు.

బార్సిలోనాకు చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు గెరార్డ్‌ పిక్‌.. సోషల్‌మీడియా సెలబ్రిటీ ఇబయ్‌ లియానోస్‌ కలిసి ఈ ప్రపంచకప్‌ పోటీలను తొలిసారి ప్రారంభించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కొంతమంది సరదాగా బెలూన్‌ కిందపడకుండా ఎగరేస్తూ ఉండే వీడియోలను తీసి టిక్‌టాక్‌లో పెట్టారు. దీంతో ఆ ఆట కాస్త వైరల్‌గా మారింది. దీన్ని గమనించిన గెరార్డ్‌, లియానోస్‌ ఈ ఆటను అంతర్జాతీయంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు చేసి విజయవంతం అయ్యారు. ఇటీవల స్పెయిన్‌లోని తారాగోనా ప్రాంతంలో ఓ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించారు. 8x8 మీటర్ల కోర్టు ఏర్పాటు చేసి అందులో సాధారణంగా ఇంటి లివింగ్‌ రూంలో ఉండే సోఫా, కూర్చీలు, టేబుళ్లు తదితర వస్తువులను పెట్టారు.

ఆట ఎలా ఆడాలి?

కోర్టులోకి ఇద్దరు పోటీదారుడు రాగానే ఒక బెలూన్‌ ఇస్తారు. దాన్ని కింద పడకుండా.. కోర్టు లోపల ఉన్న వస్తువులకు తగలకుండా జాగ్రత్తగా బెలూన్‌ను ఇరువురు పైకి ఎగరేస్తూ ఉండాలి. ఒక వేళ పడకుండా ఆపలేదంటే.. ప్రత్యర్థికి ఒక పాయింట్‌ వస్తుంది. అలా నిర్ణీత సమయానికి ఎవరికి పాయింట్లు ఎక్కువ వస్తాయో వారే మ్యాచ్‌ విజేతగా నిలుస్తారు. పోటీదారుడు గాయాలబారిన పడకుండా హెల్మెట్‌ ధరించాల్సి ఉంటుంది. 

పోటీలో పాల్గొన్న 32 దేశాలు

కొన్ని దేశాలు ఈ ఆటను సీరియస్‌గా తీసుకొన్నాయి. అమెరికా, జర్మనీ, బ్రెజిల్‌, పెరూ, బల్గేరియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్‌, చైనా, స్పెయిన్‌, ఇటలీ సహా మొత్తం 32 దేశాలు ఈ బెలూన్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొన్నాయి. ఐదు దశల్లో జరిగే ఈ టోర్నీలో పెరూ, జర్మనీ ఫైనల్‌కు చేరగా.. 6-2 తేడాతో పెరూకు చెందిన ఫ్రాన్సెస్కో డి లా క్రూజ్‌ ప్రపంచ విజేతగా నిలిచాడు. 


(ఫొటో: బెలూన్‌ వరల్డ్‌ కప్‌ ట్విటర్‌)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని