IND vs SA: సఫారీలతో తొలి వన్డే.. 40 ఓవర్లకు కుదింపు.. టాస్‌ నెగ్గిన భారత్‌

టీ20 సిరీస్‌ను కైవసం చేసుకొని ఊపు మీదున్న టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో మరో సిరీస్‌ కోసం సిద్ధమైంది. లఖ్‌నవూ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ దాదాపు రెండు గంటలకుపైగా ఆలస్యమైంది.

Updated : 06 Oct 2022 15:45 IST

లఖ్‌నవూ: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లఖ్‌నవూ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ ఎట్టకేలకు రెండు గంటల తర్వాత ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా సారథి శిఖర్ ధావన్ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. వరుణుడు పలుమార్లు అడ్డంకిగా నిలవడంతో ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకొన్నారు. బౌలర్‌ గరిష్ఠంగా ఎనిమిది ఓవర్లు మాత్రమే వేయాలి. అలాగే తొలి పవర్ ప్లే 8 ఓవర్లు మాత్రమే ఉంటుంది. ఈ మ్యాచ్‌తో రుతురాజ్‌ గైక్వాడ్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.

రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు ఇవాళ పయనమైన విషయం తెలిసిందే. దీంతో సఫారీలతో వన్డే సిరీస్‌కు ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని ఊపు మీదున్న భారత్.. వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలనే కసితో ఉంది. అయితే చివరి టీ20 మ్యాచ్‌లో ధాటిగా ఆడిన దక్షిణాఫ్రికాను తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. డికాక్‌, టెంబా బవుమా, మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్..  కీలక ఆటగాళ్లు వన్డే సిరీస్‌లోనూ ఆడతుండటం దక్షిణాఫ్రికాకు బలం. 

తుది జట్లు

భారత్: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, అవేశ్‌ ఖాన్, సిరాజ్, రవి బిష్ణోయ్

దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్‌, మలన్, ఐదెన్ మార్‌క్రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, షంసి, లుంగి ఎంగిడి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని