GT vs CSK: ‘1’ వారిది.. ‘71’ ఎవరిది..? ఫైనల్‌కు చేరే తొలి జట్టు ఏదో?

మంగళవారం నుంచి ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్, చెన్నై జట్లు (GT vs CSK) తలపడతాయి. చెపాక్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Updated : 22 May 2023 15:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ఒకరేమో డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. మరొకరు నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమ్‌. ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇరు జట్లూ ఒక్కసారి కూడా తలపడే పరిస్థితి రాలేదు. దాదాపు 54 రోజుల తర్వాత మరోసారి ‘71’వ మ్యాచ్‌లో ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాయి. అదీనూ ఫైనల్‌కు దూసుకెళ్లే తొలి టీమ్‌గా మారే అవకాశం ఉన్న మ్యాచ్‌ కావడం విశేషం. అయితే, ఇందులో ఓడిన జట్టుకు మరో ఛాన్స్‌ ఉంటుంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ జట్లు ఏవి..? ఆ కీలక మ్యాచ్‌ ఏంటనేది...? 

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధమైంది. టాప్‌-2లో నిలిచిన గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ (GT vs CSK) మధ్య చెపాక్‌ వేదికగా మే 23న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. సొంతమైదానం కావడంతో చెన్నై విజయం సాధించాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించడం అంత సులువేం కాదు. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్‌ విజయం సాధించింది. 

అన్ని విభాగాల్లోనూ గుజరాత్‌ టాప్‌

హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ అత్యంత బలమైన జట్లలో ఒకటి. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో తిరుగులేని స్టార్లు ఆ జట్టు సొంతం. ఎనిమిదో స్థానం వరకు హార్డ్‌ హిట్టింగ్‌ చేసే బ్యాటర్లు ఉన్నారు. శుభ్‌మన్ గిల్ శతకాలు సాధిస్తూ మంచి ఫామ్‌లో ఉండగా.. గతంలో త్రీడీ ప్లేయర్‌ అంటూ విమర్శలపాలైన విజయ్‌ శంకర్‌ కూడా ఈసారి తన బ్యాట్‌ను ఝుళిపిస్తున్నాడు. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్‌ తెవాతియా జట్టు భారం మోసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రషీద్‌ఖాన్‌ ప్రత్యర్థులను హడలెత్తించాడు. షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్‌, రషీద్‌ బౌలింగ్‌ దళం రాణిస్తే మరోసారి గుజరాత్‌కు తిరుగుండదు. 

బ్యాటింగ్‌ ఓకే కానీ.. బౌలింగ్‌లోనే కాస్త..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌లోకి చేరడానికి ప్రధాన కారణం ఎంఎస్ ధోనీ సారథ్యం. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలను సమన్వయం చేసుకుంటూ జట్టును ఇక్కడికి తీసుకొచ్చాడు. యువ బౌలర్లతోనే అద్భుతాలు సాధిస్తున్న ధోనీ నాయకత్వంలో ఐదో టైటిల్‌ను అందుకోవడం చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ధోనీకి చివరి సీజన్‌గా భావిస్తున్న వేళ.. మిగతా సహచరులు తమ శక్తిమేర రాణించాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం కావాలంటే మాత్రం చెన్నై నాకౌట్‌ దశలో మరింత మెరుగ్గా రాణించాలి. గత మ్యాచ్‌లో (దిల్లీపై) అదరగొట్టిన ఓపెనర్లు ఈసారి కూడా దూకుడుగా ఆడాలి. అప్పుడే మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యం ఉంటే బౌలర్లూ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ధోనీ ‘ఫినిషింగ్‌’ టచ్‌ ఇస్తే చెన్నై ఫైనల్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని