IND vs AUS: రవీంద్రజాలంలో ఆసీస్ విలవిల.. 200లోపే ఆలౌట్
వరుసగా టీ20లు, వన్డేలు ఆడిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్.. అతిపెద్ద సమరమైన ఆస్ట్రేలియాతో (Australia) నాలుగు టెస్టు సిరీస్‌ను ఆడనుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar) తొలి టెస్టుకు నాగ్‌పుర్ వేదిక.
నాగ్‌పుర్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించాడు. అతడు ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకు కుప్పకూలింది. 174/8తో మొదటి రోజు చివరి సెషన్ ఆరంభించిన కంగారుల జట్టు మరో మూడు పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్ (49), స్మిత్ (37), అలెక్స్ (36), పీటర్(31) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. టెస్టుల్లో జడ్డూ ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది 11వ సారి. అశ్విన్ మూడు, సిరాజ్, షమి తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
టీ బ్రేక్
భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. అశ్విన్, జడేజా వరుస ఓవర్లలో వికెట్లను తీస్తూ ఆసీస్‌పై ఒత్తిడి పెంచారు. అశ్విన్ బౌలింగ్‌లో (57.3వ ఓవర్) ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (6) స్లిప్‌లో విరాట్ కోహ్లీ చేతికి క్యాచ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు రెండో వికెట్. దీంతో అశ్విన్ టెస్టుల్లో భారత్ తరఫున 450 కంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (619)దే అగ్రస్థానం. ప్రస్తుతం అశ్విన్ 451 వికెట్లతో అంతర్జాతీయంగా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. తర్వాతి ఓవర్‌లోనే మర్ఫీ (0)ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 60 ఓవర్లలో ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజ్‌లో హ్యాండ్స్‌కాంబ్ (27*), నాథన్ ఉన్నారు.
క్యారీ క్లీన్‌బౌల్డ్
టీమ్‌ఇండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఎట్టకేలకు వికెట్ తీశాడు. తను అనుభవం మొత్తం ఉపయోగించిన అశ్విన్ దూకుడుగా ఆడుతున్న అలెక్స్ క్యారీ (33 బంతుల్లో 36)ని బౌల్డ్ చేశాడు. రివర్స్ స్వీప్ (53.1వ ఓవర్) ఆడబోయిన క్యారీ బంతి సరిగా కొట్టలేకపోవడంతో బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 162 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు హ్యాండ్స్‌కాంబ్ (27*)తో కలిసి క్యారీ 51 పరుగులను జోడించాడు. ప్రస్తుతం 55 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 172/6. క్రీజ్‌లో హ్యాండ్స్‌కాంబ్‌తోపాటు ప్యాట్ కమిన్స్ (6*) ఉన్నాడు.
జడ్డూ మాయ
రవీంద్ర జడేజా మళ్లీ అదరగొట్టాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన స్టీవ్ స్మిత్ (37: 107 బంతుల్లో)ను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. జడ్డూ వేసిన 42వ ఓవర్ చివరి బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ బౌల్డ్‌గా మారి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 109 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 43 ఓవర్లుముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 118/5కి చేరింది. క్రీజ్‌లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (16*), అలెక్స్ క్యారీ (4*) ఉన్నారు. ఇప్పుడు పడిన ఐదు వికెట్లలో జడేజానే మూడు వికెట్లు తీయడం విశేషం.
నడ్డివిరిచిన జడేజా..
టీమ్‌ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అదరగొట్టేశాడు. లంచ్ బ్రేక్ తర్వాత ఆసీస్ నడ్డి విరుస్తూ ఒకే ఓవర్‌లో అద్భుతమైన బంతులతో రెండు వికెట్లు తీశాడు. అర్ధశతకం దిశగా సాగిన లబుషేన్ (49) ముందుకొచ్చి ఆడబోయి కేఎస్ భరత్ అద్భుతమైన స్టంపౌట్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాతి బంతికే కొత్త బ్యాటర్ రెన్‌షా (0)ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఆసీస్ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో 36 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (25*), హ్యాండ్స్‌స్కాబ్ ఉన్నారు.
లంచ్ బ్రేక్..
బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar) ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు మొదటి రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత పేస్ బౌలర్ల దెబ్బకు ఓపెనర్లు ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1) త్వరగా పెవిలియన్‌కు చేరారు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్నస్ లబుషేన్ ( 47*), స్టీవ్ స్మిత్ (19*) నిలకడగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 74 పరుగులను జోడించారు. ఈ క్రమంలో లబుషేన్ అర్ధశతకం దిశగా సాగుతున్నాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్లు అశ్విన్, అక్షర్, రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా బంతులను వేసినప్పటికీ.. వికెట్ మాత్రం దక్కలేదు.
దూకుడు పెంచుతూ..
ఆసీస్ బ్యాటర్లు ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతున్నారు. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్ (15*), మార్నస్ లబుషేన్ (32*) ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అర్ధశతకం (55) భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ మాత్రం దక్కడం లేదు.
నిలకడగా..
పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా క్రీజ్‌లో పాతుకుపోయేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అడపాదడపా లబుషేన్ (19*) కాస్త బ్యాట్‌ను ఝులిపిస్తునప్పటికీ.. స్టీవ్ స్మిత్ (6*) మాత్రం డిఫెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. భారత్ వరుసగా పేసర్లు, స్పిన్నర్లను ప్రయోగించినా వికెట్ దక్కలేదు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy) తొలి టెస్టులో భారత (Team India) బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. ఆసీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజు మైదానంపై ఉన్న కాస్త పచ్చికను టీమ్‌ఇండియా పేసర్లు సద్వినియోగం చేసుకొంటూ వికెట్లు పడగొట్టారు. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (1)ను ఔట్ చేశారు. తొలుత సిరాజ్ బౌలింగ్‌లో (1.1వ ఓవర్) ఖవాజా ఎల్బీ కాగా.. తర్వాతి ఓవర్‌లోనే వార్నర్‌ను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 4 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజ్‌లో లబుషేన్ (8*), స్టీవ్ స్మిత్ ఉన్నారు.
టాస్ నెగ్గిన ఆసీస్
దాదాపు రెండు నెలల తర్వాత టీమ్‌ఇండియా (Team India) మళ్లీ టెస్టు ఫార్మాట్ క్రికెట్‌ను ఆడేందుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తర్వాత వరుసగా టీ20లు, వన్డేలు ఆడిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్.. అతిపెద్ద సమరమైన ఆస్ట్రేలియాతో (Australia) నాలుగు టెస్టు సిరీస్‌ను ఆడనుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar) భాగంగా తొలి టెస్టుకు నాగ్‌పుర్ (Nagpur) వేదిక. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకొంది. రెండో రోజు నుంచే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా మారుతుందనే అభిప్రాయంతో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
తాము కూడా టాస్ గెలిచి బ్యాటింగ్‌నే ఎంచుకొనేవాళ్లమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపాడు. అయితే చాన్నాళ్ల నుంచి టెస్టు ఫార్మాట్‌లోకి రావాలని ఎదురు చూస్తున్న సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో భారత్ తరఫున సూర్య, భరత్ అరంగేట్రం చేయగా.. ఆసీస్ నుంచి టాడ్ మర్ఫీ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.
జట్లు వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్
ఆసీస్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌స్కాబ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), టాడ్ మర్ఫీ, స్కాట్ బొలాండ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!