IND vs BAN: ముగిసిన మూడో రోజు ఆట.. బంగ్లా లక్ష్యం 513 పరుగులు.. ప్రస్తుతం 42/0

తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్, పుజారా సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ ఆధిక్యం 512 పరుగులకు చేరింది. ఇంకా రెండో రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం రావడం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగా బౌలర్లు అదరగొడితే విజయం మనదే.

Updated : 29 Jun 2023 17:33 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్- బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసమయానికి 12 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. మిగిలిన రెండు రోజుల్లో ఇంకా 471 పరుగులు చేస్తే బంగ్లా విజయం సాధిస్తుంది. అంతకుముందు శుబ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్ పుజారా శతకాలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 150 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరుకు డిక్లేర్డ్‌ చేసింది. 


గిల్, పుజారా శతకాలు

తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్‌ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 60 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేసింది. ఓపెనర్ శుబ్‌మన్‌ గిల్ (110), ఛెతేశ్వర్‌ పుజారా (102*) శతకాలు సాధించారు. గిల్‌ కిది తొలి సెంచరీ కాగా.. పుజారా దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో శతకం బాదడం విశేషం. కేఎల్ రాహుల్ 23, విరాట్ కోహ్లీ 19* పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో 12 ఓవర్లు మిగిలాయి.


గిల్ సెంచరీ.. ఔట్

టీమ్‌ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటి క్రితమే శతకం పూర్తి చేసుకున్న శుభ్‌మన్‌ గిల్ (110;152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఔటయ్యాడు. మెహదీ వేసిన 50వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్‌ బాదిన గిల్.. అదే ఓవర్‌లో మూడో బంతికి హసన్‌ జాయ్‌ (సబ్‌స్టిట్యూట్‌)కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్‌లో చివరి బంతికి పూజారా ఫోర్‌ బాది అర్ధ శతకం అందుకున్నాడు. 50 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు 188/2గా ఉంది. భారత్‌ 442 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 


గిల్ సెంచరీ

మూడో రోజు టీ విరామం తర్వాత ఆట మొదలైంది. టీమ్‌ఇండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లో అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. 48 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమ్‌ఇండియా స్కోరు 171/1గా ఉంది. ప్రస్తుతం భారత్‌ 425 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.  


టీ బ్రేక్‌

తొలి టెస్టులో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (23) ఔటైనప్పటికీ.. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఛెతేశ్వర్ పుజారా (33*)తో కలిసి మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (80*) నిలకడగా ఆడుతూ టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్‌ విరామం నాటికి భారత్‌ 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 394 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.


రాహుల్‌ ఔట్

టీమ్‌ఇండియా ఓపెనర్, కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ (23) మరోసారి నిరాశపరిచాడు. క్రీజ్‌లో కుదురుకొని ఆడుతున్న సమయంలో బంగ్లా బౌలర్‌ ఖలిద్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతికి (22.4వ ఓవర్‌) పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్‌కు యత్నించిన రాహుల్‌ బౌండరీ లైన్‌ వద్ద తైజుల్‌ ఇస్లామ్‌ చేతికి చిక్కాడు. దీంతో శుబ్‌మన్‌ గిల్ (55*)తో తొలి వికెట్‌కు జోడించిన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు గిల్ అర్ధశతకం పూర్తి చేశాడు. కెరీర్‌లో అతడికిది ఐదో హాఫ్ సెంచరీ. ప్రస్తుతం భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది. దీంతో ఆధిక్యం 337 పరుగులకు చేరింది. క్రీజ్‌లో గిల్‌తోపాటు ఛెతేశ్వర్ పుజారా (2*) ఉన్నాడు.


కుదురుగా ఓపెనర్లు

బంగ్లాదేశ్‌కు ఫాలో ఆన్‌ ఇవ్వకుండా టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (20*), శుబ్‌మన్ గిల్ (15*) నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో భారత్‌ మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. దీంతో బంగ్లాపై టీమ్‌ఇండియా 290 పరుగుల భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇవాళ వేగంగా ఆడి.. బంగ్లాకు భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది.


బంగ్లా 150 ఆలౌట్‌

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్ (5/40) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఓవర్‌నైట్‌ 133/8 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాకు షాక్‌ తగిలింది. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఎబాడట్ (17) కీపర్ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. చివరి వరకు పోరాడిన మెహిదీ హసన్ మిరాజ్ (25)ను అక్షర్ పటేల్ ఔట్‌ చేసి బంగ్లా తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. కేవలం 17 పరుగులకే చివరి రెండు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు.

కుల్‌దీప్‌ దెబ్బకు  ఫాలో ఆన్‌ గండం నుంచి బంగ్లా తప్పించుకోలేకపోయింది. భారత బౌలింగ్‌ ధాటికి బంగ్లాదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అంతకు ముందు టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో 254 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్‌ రహీమ్ (28) టాప్‌ స్కోరర్‌ కాగా.. జకీర్ హసన్ 20, లిటన్ దాస్ 24 పరుగులు చేశారు. బంగ్లాను ఫాలో ఆన్‌ ఆడించకుండా.. బ్యాటింగ్‌ చేయడానికే భారత కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ మొగ్గు చూపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు