IND vs NZ: నాలుగో రోజు భారత్‌దే ఆధిపత్యం.. ఆఖర్లో అశ్విన్‌ మాయ

అయితేతభారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసింది..

Updated : 28 Nov 2021 18:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా మేమున్నామంటూ మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.. ప్రత్యర్థి జట్టును నాలుగో రోజే కాస్త ఒత్తిడిలోకి నెడుతూ బౌలర్లు తొలి వికెట్‌ పడగొట్టారు.. ఇవాళ ఆరంభ సెషన్‌లో వెనుకబడినా సరే పుంజుకుని మరీ ఆఖరి రోజు సవాల్‌కు సిద్ధమని నిరూపించారు మన టీమ్‌ఇండియా క్రికెటర్లు..

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసింది. 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ ఆట ముగిసేసమయానికి వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించిన టీమ్‌ఇండియా.. ఆఖర్లో కివీస్‌ వికెట్ తీసి నాలుగో రోజు ఆటలో ఆధిపత్యం కనబరిచింది. న్యూజిలాండ్ గెలవాంటే ఒక్క రోజు (90 ఓవర్లు)లో 280 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా..రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 296/10. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం టీమ్‌ఇండియా లీడ్‌ 283 పరుగులకు చేరింది.

భారత్‌ నిలబడటానికి కారణం వారే..

14/1తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టిమ్‌ సౌథీ, జేమీసన్‌ దెబ్బకు టీమ్‌ఇండియా బ్యాటర్లు హడలెత్తిపోయారు. అయితే శ్రేయస్ అయ్యర్ (65), అశ్విన్‌ (32) అర్ధశతక భాగస్వామ్యంతో భారత్‌ను ఆదుకున్నారు. అశ్విన్‌ ఔటైనా సాహా (61*)తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మరో శతకం చేస్తాడని భావించిన శ్రేయస్‌ దురదృష్టవశాత్తూ సౌథీ బౌలింగ్‌లో బంతి గ్లౌజ్‌కు తాకి కీపర్‌ చేతికి చిక్కాడు. అయితే అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ (28*)తో కలిసి సాహా మరో వికెట్‌ను పడనీయలేదు. అక్షర్‌-సాహా జోడీ ఎనిమిదో వికెట్‌కు అర్ధశతకం (67 పరుగులు) భాగస్వామ్యం నిర్మించారు. ఆధిక్యం 280 పరుగులు దాటడం.. ఆఖర్లో కేవలం నాలుగైదు ఓవర్లే పడనుండటంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయాలని కెప్టెన్‌ అజింక్య రహానె నిర్ణయించాడు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ అయింది.

ఆఖర్లో  మనకు కలిసొచ్చిన అదృష్టం..

నాలుగో రోజు ఆటలో మొదటి సెషన్‌ మాత్రమే పర్యాటక జట్టుది. మిగతా రెండు సెషన్లు టీమ్‌ఇండియావే. రెండో సెషన్‌లో అయ్యర్, అశ్విన్.. మూడో సెషన్‌లో సాహా, అక్షర్‌ బ్యాటింగ్‌లో రాణించారు. మరీ ముఖ్యంగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను చివర్లో అశ్విన్‌ తన మాయతో బోల్తా కొట్టించాడు. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (2)ను ఔట్‌ చేసి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. యంగ్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు అశ్విన్‌ అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బంతి వికెట్లను తాకలేదని డీఆర్‌ఎస్‌లో తేలింది. సమీక్షకు వెళ్లడంలో జాప్యం చేయడంతో విల్‌ పెవిలియన్‌కు చేరకతప్పలేదు. ఒకవేళ డీఆర్‌ఎస్‌కు వెళ్తే మాత్రం గ్యారంటీగా బతికిపోయేవాడే. ఇక ఆఖరి రోజు తొమ్మిది వికెట్లను పడగొట్టితే విజయం భారత్‌ వశమవుతుంది. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని