IND vs SL : లంకతో తొలి టెస్టు.. టీమ్‌ఇండియాకు జట్టు కూర్పే అసలైన సవాల్

శ్రీలంకతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమవుతోంది. వన్డేలు, టీ20 మ్యాచ్‌లతో...

Published : 04 Mar 2022 01:30 IST

 శ్రీలంకతో నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంకతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమవుతోంది. వన్డేలు, టీ20 మ్యాచ్‌లతో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. శుక్రవారం (మార్చి 4) నుంచి మొహాలీ వేదికగా తొలిపోరు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జట్టు కూర్పు ఎలా ఉండనుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓపెనింగ్‌ జోడీ.. మిడిలార్డర్‌లో ఆదుకునే బ్యాటర్లు.. బౌలర్లు ఎవరనే విషయాలను అంచనా వేద్దాం..

మిడిలార్డరే కీలకం

గత దశాబ్దకాలంగా ఓపెనర్లు మారుతున్నారేమో కానీ.. మిడిలార్డర్‌లో మాత్రం వారిద్దరే కీలకం. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ ‘ఇద్దరు’ ఎవరనేది.. ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె. వీరి ఇద్దరికి ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. తర్వాత రిషభ్‌ పంత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ వచ్చారు. అయితే గత రెండేళ్ల నుంచి ఫామ్‌తో తంటాలుపడుతున్న పుజారా, రహానెలకు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో స్థానం దక్కలేదు. వీరి స్థానంలో కుర్రాళ్లు మయాంక్‌ అగర్వాల్, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్ అయ్యర్‌,హనుమ విహారిలకు అవకాశం కల్పించింది. కెరీర్‌లో ఆడిన తొలి టెస్టులోనే శతకం, హాఫ్ సెంచరీలతో చెలరేగిన శ్రేయస్‌ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తనకొచ్చిన ఛాన్స్‌ విహారి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మరి ఈసారి ఎలా రాణిస్తాడో చూడాలి. 

ఓపెనర్లుగా ఎవరు వస్తారో..?

ప్రస్తుత టీమ్‌ఇండియా జట్టులో ఓపెనర్లకు కొదవలేదు. మయాంక్‌ అగర్వాల్, శుభ్‌మన్‌ గిల్‌తోపాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అదరగొట్టిన ప్రియాంక్ పంచాల్‌ సిద్ధంగా ఉన్నారు. అయితే టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్‌ చేయగలడు. ఈ క్రమంలో ఓపెనర్లుగా జట్టు యాజమాన్యం ఎవరిని పంపిస్తుందో కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఓ వైపు మయాంక్‌ అగర్వాల్‌ మాత్రం పక్కాగా కనిపిస్తుండగా.. మరొక ఓపెనర్‌ ఎవరనేది తేలాల్సి ఉంది. తుది జట్టులో ఆరు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో దిగాలనుకుంటే ప్రియాంక్‌ పంచాల్, హనుమ విహారి, శుభమన్‌ గిల్, కేఎస్ భరత్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. హనుమ విహారి/శుభ్‌మన్‌ని తీసుకుంటే మిడిలార్డర్‌లో అక్కరకొస్తారు. అప్పుడు మయాంక్‌తోపాటు రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం లేకపోలేదు. ఇక వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో..తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, విహారి/గిల్, రిషభ్‌ పంత్‌ ఉండనే ఉన్నారు. 

బౌలర్లు ఐదుగురా.. ఆరుగురా..?

గతంలో స్వదేశం వేదికగా భారత్‌ సిరీస్‌లను ఆడేటప్పుడు స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యమిచ్చేది. అయితే ఇప్పుడు స్పిన్న్‌తోపాటు ఫాస్ట్‌ బౌలింగ్‌ పిచ్‌లనూ రూపొందిస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఇప్పుడు నాణ్యమైన పేసర్లు భారత్ సొంతం. ఐదుగురు బౌలర్లలో ముగ్గురు స్పిన్నర్లు - ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు లేదా.. ఇద్దరు స్పిన్నర్లు-ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో టీమ్‌ఇండియా బరిలోకి దిగడంపైనా జట్టు యాజమాన్యం ఆలోచించే అవకాశం ఉంది. భారత జట్టుకు అసలైన ఇద్దరు టాప్‌ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, రవి చంద్రన్‌ అశ్విన్‌ బ్యాటింగ్‌ చేయగలిగే సమర్థులు. అందుకే ఇద్దరు స్పిన్నర్లతో ఆడేటప్పుడు ప్రత్యేకంగా ఎవరినీ తీసుకోనక్కర్లేదు. అప్పుడు ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు బుమ్రా, సిరాజ్‌, షమీకి తుది జట్టులో స్థానం కల్పించొచ్చు. అశ్విన్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే.. ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలంటే మాత్రం చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. అప్పుడు షమీ/సిరాజ్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. 

లంకతో టెస్టులకు టీమ్‌ఇండియా:

రోహిత్‌ శర్మ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్, ప్రియాంక్‌ పంచాల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, హనుమ విహరి, శుభమన్‌ గిల్, రిషభ్ పంత్‌ (వికెట్‌కీపర్‌), కేఎస్ భరత్, అశ్విన్‌, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), షమి, సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, సౌరభ్ కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని