ICC: తొలిసారి మహిళా క్రికెట్‌ ఎఫ్‌టీపీ.. ఆ టీమ్‌తో భారత్‌కు నో సిరీస్‌!

తొలిసారి మహిళా క్రికెట్‌కు సంబంధించిన భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. వచ్చే మూడేళ్లపాటు...

Updated : 16 Aug 2022 16:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలిసారి మహిళా క్రికెట్‌కు సంబంధించిన భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. వచ్చే మూడేళ్లపాటు (2022-25) అన్ని ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించనుంది. ‘‘ఐసీసీ మహిళా ఛాంపియన్‌షిప్‌ (ఐడబ్ల్యూసీ) ఈవెంట్‌లో భాగంగా 10 టీమ్‌లు వన్డే సిరీస్‌లను ఆడతాయి. దీంతో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం జట్లకు ఉంటుంది. 2022-25 ఎఫ్‌టీపీలో ఐసీసీతోపాటు ద్వైపాక్షిక సిరీస్‌లను కలుపుకొని దాదాపు 300కుపైగా మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టీ20లు ఉన్నాయి. మరిన్ని మ్యాచ్‌లను నిర్వహించాలని సభ్య దేశాలు విశేషంగా కృషి చేశాయి’’ అని ఐసీసీ వెల్లడించింది. భారత్‌ ద్వైపాక్షిక సిరీసుల్లోనే 59 మ్యాచ్‌లను ఆడనుంది.

మూడేళ్ల వ్యవధిలో (2022-25) ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, విండీస్‌ జట్లతో భారత్‌ మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో కొన్ని ద్వైపాక్షిక, ట్రైసిరీస్‌లు ఉన్నాయి. పాక్‌తో ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ లేకపోవడం గమనార్హం. అలానే 2023 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌, ఆసీస్‌తో టీమ్‌ఇండియా ఒక్కో టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. 2025లో భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. అదేవిధంగా మల్టీ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌-ఆసీస్ మధ్య రెండు యాషెస్‌ సిరీస్‌లు నిర్వహిస్తారు. ఒక టెస్టు, మూడేసి వన్డేలు, టీ20లతో కూడిన సిరీస్‌ను ఆయా దేశాల పిచ్‌ల మీద ఆడతాయి. ‘‘ఇంగ్లాండ్, ఆసీస్, భారత్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే టెస్టులను ఆడతాయి. ఇతర జట్లు ఎక్కువగా టీ20 సిరీస్‌లను ఆడేందుకు మొగ్గుచూపాయి. ఎఫ్‌టీపీ షెడ్యూల్‌ను రూపొందించడం మహిళల క్రికెట్‌ చరిత్రలో ఓ మధుర ఘట్టం. ఎఫ్‌టీపీ కేవలం భవిష్యత్తు పర్యటనల కోసమే కాకుండా మహిళా క్రికెట్‌ పునాదిని పటిష్ఠపరిచేందుకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఐడబ్ల్యూసీ వల్ల ఉమెన్స్‌ క్రికెట్‌ మరోస్థాయికి వెళ్తుందని భావిస్తున్నాం. న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో హోరాహోరీ మ్యాచ్‌లను చూశాం. అందుకే ఎఫ్‌టీపీలో మరిన్ని మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించాం’’ అని ఐసీసీ జనరల్ మేనేజర్‌ వసీమ్‌ ఖాన్‌ తెలిపారు.  

భారత్‌ పాల్గొనే ద్వైపాక్షిక సిరీస్‌లు ఇలా.. 

* ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది సెప్టెంబర్‌లో (10 నుంచి 24 వరకు) మూడు టీ20లు, మూడు వన్డేలను ఆడనుంది. 

* డిసెంబర్‌-2022లో ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌

* వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, భారత్‌తో కూడిన ట్రై సిరీస్‌లో భాగంగా నాలుగు టీ20లు

* 2023 జూన్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు

* స్వదేశం వేదికగా సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2023లో దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు

* న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు

* డిసెంబర్‌ 2023లో ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు, మూడు టీ20లు 

* డిసెంబర్‌ 2023లోనే ఆసీస్‌తో ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు

* నవంబర్‌ 2024లో ఆసీస్‌తో ఆస్ట్రేలియా వేదికగా మూడు వన్డేలు

* డిసెంబర్‌ 2024లో విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు

* జనవరి 2025లో ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు 

ఇవే కాకుండా ఐసీసీ మెగా టోర్నీల్లోనూ భారత్‌ ఆడనుంది. 

* ఫిబ్రవరి 2023లో దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ 

* సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2024లో బంగ్లాదేశ్‌ వేదికగా మళ్లీ పొట్టి ప్రపంచకప్‌

* సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2025లో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts