Football Match: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తొలిసారి వైట్‌కార్డ్‌.. దేనికి సంకేతం?

ఫుట్‌బాల్‌ ఆటలో ఇప్పటిదాకా ఎల్లో, రెడ్‌ కార్డులను మాత్రమే చూసిన ప్రేక్షకులు.. తొలిసారి రిఫరీ వైట్‌ కార్డును చూపించడంతో ఫుట్‌బాల్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఫుట్‌బాల్ ఆటలో వైట్‌ కార్డును దేనికి సంకేతంగా చూపిస్తారో తెలుసా..?

Published : 25 Jan 2023 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ కలిగిన ఆటల్లో ఫుట్‌బాల్‌ (Football) ముందు వరుసలో ఉంటుంది. సాధారణంగా ఫుట్‌బాల్‌లో ఎవరైనా ఆటగాడు తప్పుచేస్తే ఎల్లో (Yellow Card) లేదా రెడ్‌ కార్డు (Red Card)లను రిఫరీ చూపిస్తారు. ఆటగాళ్లు  ఏదైనా తప్పు చేస్తే తొలిసారి హెచ్చరికగా ఎల్లో కార్డును, ఆట నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆటగాడిని బయటికి వెళ్లమని సూచిస్తూ రెడ్‌ కార్డును రిఫరీ ఉపయోగిస్తారు. తాజాగా జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో రిఫరీ వైట్‌ ( White Card) కార్డును ఉపయోగించడం చర్చనీయాంశమైంది. 1970లో ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup)లో ఈ కార్డుల నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎల్లో, రెడ్‌ కార్డులను మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. కానీ,  తొలిసారి వైట్‌ కార్డు చూపించడంతో ఫుట్‌బాల్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఫుట్‌బాల్ ఆటలో వైట్‌ కార్డును దేనికి సంకేతంగా చూపిస్తారో తెలుసుకుందాం. 

బెన్‌ఫికా, స్పోర్టింగ్ లిస్బన్‌ జట్ల మధ్య జరుగుతున్న మహిళల క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు పోర్చుగల్‌కు చెందిన కాట్రినా కంపోస్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బెనిఫికా 3-0 ఆధిక్యంగా కొనసాగుతుండగా ప్రేక్షకుల మధ్యలో ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి వైద్య సహాయం అందించేందుకు రెండు జట్లకు చెందిన వైద్యులు స్టాండ్స్‌లోకి చేరుకుని చికిత్స అందిస్తారు. వైద్యుల సేవలకు అభినందనగా రిఫరీ వైట్‌ కార్డును చూపించారు. ఇరు జట్ల బృందాలు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా రిఫరీ వైట్‌ కార్డును చూపించారు. 

ఫుట్‌బాల్‌ ఆటలో వైట్‌ కార్డును పోర్చుగల్‌ నేషనల్‌ ప్లాన్ ఫర్‌ ఎథిక్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ (PNED) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఆటలో ఇరు జట్ల ఆటగాళ్లు లేదా సిబ్బంది క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తే వారికి అభినందగా రిఫరీ వైట్‌ కార్డును చూపించవచ్చు. దాంతోపాటు ఆటగాడు గాయపడితే కంకషన్‌ ప్లేయర్‌ వచ్చేందుకు వైట్‌కార్డ్‌ ఉపయోగించవచ్చు.  ప్రస్తుతం ఈ నిబంధనను పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ( FPF) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. త్వరలోనే అంతర్జాతీయ ఆటలో సైతం దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో బెన్‌ఫికా జట్టు స్పోర్టింగ్‌ లిస్బన్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని