Updated : 02/11/2021 05:03 IST

T20 Worldcup : ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి 5 కారణాలివేనా!

ఒక కట్టెను చేత్తో విరగ్గొట్టొచ్చు... అదే పది కట్టెల్ని మోపుగా కడితే విరచడం కష్టం! ఇది మన చిన్నతనం నుంచి పెద్దలు చెబుతున్న మాట. 

ఇప్పుడు దీనిని క్రికెట్‌లో టీమిండియాకు అన్వయిస్తే... ఒక కట్టెను విరగొట్టలేం... అదే పది కట్టెల్ని కలిపి ఇస్తే ఎంచక్కా విరిచేయొచ్చు!

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన చూస్తే... ఎవరన్నా ఈ మాటే చెబుతారు. మొన్నటివరకు ఒక్కొక్కరు ఐపీఎల్‌లో ఆడి సూపర్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు కలసి టీ20 ప్రపంచకప్‌ ఆడి ఉసూరుమనిపిస్తున్నారు. భారత్‌ దారుణ పరాజయాలకు కారణాలేంటి అని ఆలోచిస్తే... ఓ ఐదు బలంగా కనిపిస్తున్నాయి! 

1. వాళ్లు ఆడతారులే

టీ20 ప్రపంచకప్‌ ముందు భారత జట్టులోని ఆటగాళ్లంతా అక్కడే ఉండి ఐపీఎల్‌ ఆడారు. వందల సంఖ్యలో పరుగులు చేసి, తామెందుకు మేటి క్రికెటర్‌లో చూపించారు. విరాట్‌ కోహ్లీ (405), రోహిత్‌ శర్మ (381), కేఎల్‌ రాహుల్‌ (626), సూర్య కుమార్‌ యాదవ్‌ (317), రిషబ్‌ పంత్‌ (419), ఇషాన్‌ కిషన్‌ (241), రవీంద్ర జడేజా (227) పరుగుల వరద పారించారు. అయితే వీరంతా కలిపి జట్టుగా ఆడుతున్నప్పుడు వెనకాల వచ్చేవాళ్లు ఆడతారులే... అనేలా బ్యాట్లకు రెస్ట్‌ ఇచ్చారు అనొచ్చు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ (57), పంత్‌ (39) రాణించినా జట్టుకు అవసరమైనన్ని కావు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ పరుగుల గురించి చర్చే అనవసరం. హార్దిక్‌ పాండ్య (23), రవీంద్ర జడేజా (26)లేకపోతే మన జట్టు స్కోరు బోర్డు 100 దాటేది కాదు. 

క్రికెట్‌ అనేది టీమ్‌ గేమ్‌ అని అందరూ చెబుతారు. మన స్టార్‌ క్రికెటర్లు దాన్ని వేరేలా అర్థం చేసుకున్నారేమో. ఎవరికి వారు, చెత్త షాట్లు కొట్టి మరీ ఔటయ్యారు. ఈ మాట కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే అంటున్నాడు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొన్నటి వరకు పరుగుల వరద పారించిన మన స్టార్లు మసకబారి నిస్తేజంగా డగౌట్లకు వచ్చేస్తున్నారు. పట్టుమని పాతిక బంతులు ఎదుర్కోవడం లేదంటేనే పరిస్థితి తెలుసుకోవచ్చు. ఓపెనింగ్‌ జోడీ కుదురుకోకపోవడంతో మిడిలార్డర్‌ మీద ఒత్తిడి పడుతోంది. అక్కడ అంతటి ఘనుడు లేకపోవడం పెద్ద లోటు. ఇక ఆల్‌రౌండర్‌ పాండ్య ముచ్చట పాతదే. 

2. బౌలింగ్‌లోనూ అంతే

ఈ ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత ఓటమికి కారణం బ్యాటర్ల మీద నెట్టేయడం కనిపిస్తోంది. అయితే మొత్తం తప్పు వారిదేనా అంటే కాదని అంటున్నారు క్రికెట్‌ పండితులు. దీనికి ఉదాహరణకు పాకిస్థాన్‌ మ్యాచ్‌లో మన వాళ్ల బౌలింగ్‌ తీరు ఉదహరిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క వికెట్‌ తీయలేకపోవడం మన బౌలర్ల అప్రోచ్‌ సరిగా లేదు అనడానికి నిదర్శనం అని చెబుతున్నారు. ఇక రెండో మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో జరిగినప్పుడు ఒక్క బుమ్రాలోనే వికెట్లు తీయాలనే జీల్‌ కనిపించింది. మిగిలిన వారి విషయంలో అలాంటి దృక్పథమే లేదు అంటున్నారు నెటిజన్లు. 

ఈ టోర్నీలో భారత తురుపుముక్క అని అందరూ భావించిన వరుణ్‌ చక్రవర్తి ఆశించిన మేర ప్రదర్శన ఇవ్వడం లేదు. పరుగుల వరదను నియంత్రిస్తున్నా... మిస్టరీ స్పిన్నర్‌ అనే పేరును సార్థకం చేసుకునేలా విచిత్ర బంతులు వేసి వికెట్లు తీయలేకపోతున్నాడు. రవీంద్ర జడేజా పరిస్థితీ ఇంతే. ఏమాత్రం వికెట్లు తీసే బంతులు అతని నుంచి కనిపించలేదు. ఇక పేసర్ల సంగతి చూస్తే... మహ్మద్‌ షమీ దారుణంగా విఫలమవుతున్నాడు. భువనేశ్వర్‌ పూర్తిగా పట్టుతప్పిపోయాడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో బుమ్రా అస్సలు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వనేలేదు. శార్దూల్‌ ఠాకూర్‌ కివీస్‌ మ్యాచ్‌లో తన ప్రదర్శనతో  వాళ్లకు విజయం వేగవంతం చేశాడని అభిమానులు తిట్టిపోస్తున్నారు. 

3. ముందే కాడి వదిలేశాడా

టీమిండియాలో కింగ్‌, రన్‌ మెషీన్‌, ఛేజింగ్‌ స్టార్‌ అంటూ విరాట్‌ కోహ్లీకి చాలా పేర్లు ఉన్నాయి. మనకు చాలా ఏళ్లుగా వీలు కాని విదేశీ టూర్ల విజయాలు అందించిన కెప్టెన్సీ అతనిది. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితులు మారిపోయాయి. లక్ష్యాలను ఛేదించడంలో కోహ్లీ ఏ మాత్రం పరుగులు చేయలేకపోతున్నాడు. తన బ్యాటింగ్‌లో పట్టు తగ్గిందనే విషయం అతనికీ తెలిసి... ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ వదులుకుంటా అని ప్రకటించేశాడు. దీంతో ఈ సారి కసిగా ఆడి కప్‌ తెస్తాడేమో అనుకున్నారంతా. కానీ పరిస్థితి చూస్తుంటే ముందే కాడి వదిలేశాడా అనిపిస్తోంది. తక్కువ స్కోరు ఛేజింగ్‌ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఉంటే ఆ జోష్‌ వేరే ఉంటుంది. కానీ ప్రపంచకప్‌లో అది మిస్‌ అయ్యింది. 

4. అలసట నిజమేనా...

ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు ఘోర పరాజయానికి అలసట కారణమవ్వొచ్చు అని అక్కడక్కడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఐపీఎల్‌ అనే మాటలూ వినొచ్చు. అయితే ఇది నిజమేనా... అలసట కారణంతోనే మన వాళ్లు మ్యాచ్‌లు సరిగ్గా ఆడటం లేదా అంటే... ఈ కారణం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్‌ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండకుండా మొత్తం ఫ్యామిలీనే అక్కడికే తీసుకెళ్లిపోయారు. కాబట్టి వాళ్లకు హోం సిక్‌ లాంటివి కష్టమే. అలాగే ఇంతటి అలసట ఉంటే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎలా ఆడినట్లు. 

ఒకవేళ కొంతమంది అంటున్నట్లు అలసటే కారణం అనుకుంటే... బీసీసీఐ ఏం చేస్తున్నట్లు. టీమిండియా స్టార్‌ ఆటగాళ్లకు సరైన విశ్రాంతి ఉండేలా చర్యలు తీసుకుంటూ ఐపీఎల్‌ నిర్వహించాలి. ఐపీఎల్‌ కోసం ఏకంగా ఐసీసీ టోర్నీలను పణంగా పెట్టలేం కదా. కానీ గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతోంది. అయినా ఐపీఎల్‌ స్టైల్‌, టైమ్‌ మారడం లేదు. దీంతో ఒకవేళ అలసట, బయోబబుల్‌ కష్టాలు అనేది నిజమే అయితే... బీసీసీఐ దీనిపై సీరియస్‌గా ఆలోచించాలి. ఎందుకంటే బయోబబుల్‌ ఇంత త్వరగా క్రికెట్‌ను వదిలి పెట్టి వెళ్లేలా లేదు. 

5. తప్పులు తెలుసుకోకపోవడం

జట్టుగా ఆడటం గురించి చెబుతున్నప్పుడు... తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాం కదా. ఆ సమయం ఇదే. ‘‘ఆశ్చర్యంగా ఉంది. బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. నిజానికి రక్షించుకునేంత స్కోరు చేయలేదు కానీ.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దీన్ని అధిగమించాలి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఆ పని చేయలేకపోయాం. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్‌లు మిగిలున్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం’’ అని మ్యాచ్‌ తర్వాత కోహ్లీ చెప్పాడు. 

మ్యాచ్‌ పరిస్థితి అర్థం చేసుకొని ఇలా చెప్పడం వరకు ఓకే. మరి తొలి మ్యాచ్‌కి, రెండో మ్యాచ్‌కి మధ్యలో వారం గ్యాప్‌ ఉంది. ఈ వారంలో టీమ్‌తోను, మెంటార్‌ మహేంద్రసింగ్‌ ధోనీతోను, కోచ్‌ రవి శాస్త్రితోను కూర్చుని తమ తప్పుల్ని చర్చించుకున్నారు. ఒకవేళ అదే జరిగి ఉంటే... తొలి మ్యాచ్‌లో చేసిన తప్పులే మళ్లీ చేసి రెండో మ్యాచ్‌లో ఎందుకు ఔట్‌ అవుతారు. కాబట్టి తప్పులు తెలుసుకోలేదు అనుకోవాలి, లేదంటే తెలుసుకున్నా వాటిని ఆచరణలో పెట్టి మార్చుకోలేకపోయారని భావించాలి.

ఆఖరిగా... ఈ టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్‌లు మనకు మిగిలి ఉన్నాయి. అందులో అఫ్గానిస్థాన్‌ చాలా డేంజర్‌. పెద్ద జట్లకు, అందులోనూ మన లాంటి దెబ్బ తిన్న జట్లకు చావు దెబ్బ తీయడం వారికి అలవాటు. కాబట్టి ఎంత జాగ్రత్తపడితే అంత మంచిది. టీమ్‌ ఇండియా ఇకనైనా మేలుకో..!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని