Updated : 07 Sep 2021 22:41 IST

భారత్‌ ఘన విజయంలో.. హీరోలు వీళ్లే..

ఇంటర్నెట్‌ డెస్కు : దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో భారత్‌ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని సొంత గడ్డపైనే మట్టి కరిపించి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. అలా అని ఈ విజయం అనుకున్నంత సులభంగా ఏం దక్కలేదు. అందుకే ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. మరి ఇంతటి అపూర్వ విజయం వెనుక ఉన్న హీరోలెవరో చూద్దామా.. 

* విదేశాల్లో తొలి శతకంతో మెరిసిన హిట్‌మ్యాన్‌..

భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విదేశాల్లో తొలి టెస్టు శతకం నమోదు చేసింది ఈ మ్యాచులోనే. ఇంగ్లాండ్‌ బౌలర్‌ మొయిన్‌ అలీ వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన రోహిత్‌ ఈ మైలురాయిని అందుకున్నాడు. అంతకు ముందు స్వదేశంలో ఏడు శతకాలు బాదినా.. ఈ సెంచరీ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఓవల్‌ పిచ్‌లో రోహిత్‌ క్రీజులో పాతుకుపోయి ఇంగ్లాండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. నెమ్మదిగా ఆడాడు. ఈ తరంలోని భారీ హిట్లర్లలో ఒకడిగా పేరున్న హిట్‌మ్యాన్‌.. తన సహజ శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడుతూ శతకం బాదడం గమనార్హం. దీంతో, మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌, మరో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ మురళి విజయ్‌ తర్వాత అత్యధిక బంతుల్లో సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. 2013లో ముంబయి, 2019లో రాంచిలో జరిగిన టెస్టు మ్యాచుల్లో కూడా రోహిత్‌ సిక్సర్‌తో వంద పరుగులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఓవల్‌లో సెంచరీ చేసిన అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ఈ సిరిస్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో నేను 100 బంతులను ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓవల్‌ మ్యాచులో 250 బంతులను ఎదుర్కోవవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.

* బూమ్‌ బూమ్‌ బుమ్రా..

ఫ్లాట్‌ పిచ్‌పై 140 గంటకు కిలో మీటర్ల వేగంతో బంతులేస్తూ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెట్టిన జస్ర్పీత్‌ బుమ్రా కూడా ఈ మ్యాచులో కీలక పాత్ర పోషించాడు.  స్పిన్నర్‌ రవీంద్ర జడేజాతో కలిసి పాత బంతితోనే వికెట్ల వేట మొదలు పెట్టాడు. రివర్స్ స్వింగ్‌ బంతులతో మిడిల్ ఆర్డర్‌ని కుప్పకూల్చాడు. నాలుగో టెస్టు చివరి రోజు ఆరు ఓవర్లలో ఆరు పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఫుల్ ఇన్‌స్వింగ్‌ యార్కర్‌తో ఓలీ పోప్‌ని క్లీన్ బౌల్డ్‌ చేశాడు. ఈ వికెట్‌తోనే బుమ్రా భారత్‌ తరఫున అత్యంత వేగంగా 24 టెస్టుల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. దీంతో మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలైన విషయం తెలిసిందే. 

* మునుపటి ఫామ్‌ అందుకున్న పుజారా..

మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఛెతేశ్వర్‌ పుజారా కూడా ఈ మ్యాచులో పుంజుకుని మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 127 బంతుల్లో 61 పరుగులు చేసి మిడిలార్డర్‌కి బలాన్ని చేకూర్చాడు. ఈ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కాలు బెణికినా.. రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 153 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫ్రంట్‌, బ్యాక్‌ ఫుట్‌లో ఆడుతూ ఇన్‌స్వింగ్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అంతకు ముందు హెడింగ్లీ టెస్టులో కూడా పుజారా 91 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 

* జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న శార్ధూల్‌..

కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న శార్ధూల్‌ ఠాకూర్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బంతితో పాటు బ్యాటుతోనూ మెరిసి టెస్టుల్లో తానెంత కీలక ఆటగాడో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచులో రెండు అర్ధ శతకాలు సహా.. భారత్‌కి కొరకరాని కొయ్యగా తయారైన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ని ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత డెలివరీలతో రెండు కీలక వికెట్లు తీసి భారత్‌ విజయాన్ని ఖాయం చేశాడు. బ్యాటు పట్టి మొదటి ఇన్నింగ్స్‌లో 31 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి టెస్టు క్రికెట్లో రికార్డు నెలకొల్పాడు. అదే జోష్‌ కొనసాగిస్తూ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో హాఫ్‌ సెంచరీ బాదాడు. ఇంగ్లిష్‌ బౌలర్‌ రాబిన్సన్‌ వేసిన స్లో బాల్‌ని లాంగ్‌ ఆన్‌లో సిక్స్‌గా మలిచిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ క్రమంలోనే రిషభ్‌ పంత్‌తో కలిసి శార్ధూల్‌ శతక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ విజయంలో కీలకంగా మారాడు.

* సత్తా చాటుకున్న సీనియర్‌ బౌలర్లు..

ఇక ఈ మ్యాచులో మనం చెప్పుకోవాల్సింది సీనియర్‌ బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాల గురించి. పాతబడిన బంతితో రివర్స్‌ స్వింగ్‌ బంతులేస్తూ ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ని బెంబేలెత్తించాడు జడేజా. అతడు వేసిన 30 ఓవర్లలో 50 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఉమేశ్ యాదవ్‌ కూడా నిప్పులు చెరిగే బంతులతో ఆకట్టుకున్నాడు. టీ విరామం తర్వాత చివరి రెండు వికెట్లను తీసి భారత్‌కి తిరుగులేని విజయం అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 76 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని