
CSK vs KKR: తొమ్మిదేళ్ల క్రితం షాక్ ఇచ్చారు... ఇప్పుడు ఏం చేస్తారో?
(Photo: KKR Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021 (IPL 2021) ఆఖరి పోరు మరికాసేపట్లో మొదలుకానుంది. టైటిల్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super kings), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) తలపడబోతున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు రెండోసారి తలపడబోతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం తొలిసారి జరిగిన పోరు అంటే 2012 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై ( CSK)పై కోల్‌కతా ( KKR) ఘన విజయం సాధించింది. అసలు ఆ మ్యాచ్ ఎలా జరిగింది, ప్రత్యేకతలేంటో చూద్దామా!.
ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. ఎనిమిది సార్లు ఫైనల్‌కు చేరిన ఆ జట్టు మూడు సార్లు టైటిల్ సాధించి.. ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇందులో ఒకసారి కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనే ఓటమిపాలవ్వడం గమనార్హం. 2010, 2011లో వరుసగా రెండేళ్లు కప్పు సాధించిన ధోనీసేన 2012లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూసింది. కానీ, గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా జట్టు దానికి అడ్డుకట్ట వేసింది. చెన్నైను ఓడించి షాకిచ్చింది.
హస్సీ, రైనా మెరుపులు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు మైఖేల్ హస్సీ (54; 43 బంతుల్లో 4x4, 2x6), మురళీ విజయ్ (42; 32 బంతుల్లో 4x4, 1x6) ధాటిగా ఆడి శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే విజయ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (73; 38 బంతుల్లో 3x4, 5x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హస్సీతో కలిసి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. అయితే, అర్ధశతకం తర్వాత ధాటిగా ఆడే క్రమంలోనే హస్సీ ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (14 నాటౌట్; 9 బంతుల్లో 2x4) క్రీజులోకి వచ్చి రైనాకు చక్కటి సహకారం అందించాడు. చివరి బంతికి రైనా ఔటైనా కోల్‌కతా ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో మ్యాచ్ ఇక చెన్నై సొంతం అని ‘విజిల్ పోడు’ బ్యాచ్ ఫిక్స్ అయిపోయారు. ఈల వేసి గోల చేద్దాం అని సిద్ధమైపోయారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ ఎందుకవుతుంది. చెన్నైకి కోల్‌కతా బిస్లా రూపంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అతనికి జాక్వెస్ కలిస్ తోడవడంతో మ్యాచ్‌ను మూట కట్టి... కప్పును గెలుచుకున్నారు.
బిస్లా, కలిస్ పిడుగులు..
(Photo: KKR Twitter)
2012 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అంటే గౌతమ్ గంభీరే అని చెప్పాలి. అంతలా జట్టు విజయాల్లో పాలుపంచుకున్నాడు. అయితే ఈ భారీ లక్ష్య ఛేదనలో గౌతమ్ గంభీర్ (2) విఫలమయ్యాడు. తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో ఫైనల్ ముందు వరకు భీకర్ హిట్టర్ బ్రెండన్ మెక్‌కలమ్ ఉండేవాడు. అయితే ఫైనల్‌కు గంభీర్ అతనిని తీసుకోలేదు. దీంతో ఆదిలోనే చెన్నై మ్యాచ్‌పై పట్టుసాధించేలా కనిపించింది. అయితే ఊహించనవి విధంగా గంభీర్ మన్విందర్ బిస్లాపై నమ్మకం ఉంచి, అతనిని తీసుకున్నాడు. చాలా రోజులగా డగౌట్‌కే పరిమితమయ్యాడు, అతనేం ఆడతాడులే అని అందరూ అనుకున్నారు ఆ రోజు. కానీ బిస్లా అలా అనుకోలేదు. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచుకున్నాడు. జట్టుకు ఒంటి చేత్తో కప్ అందించాడు. బిస్లా (89; 48 బంతుల్లో 8x4, 5x6), జాక్వెస్ కలిస్ (69; 49 బంతుల్లో 7x4, 1x6) దంచికొట్టారు. చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో పిడుగుల వర్షం కురిపించారు. దీంతో ఇంకేముంది కప్ కోల్‌కతాదే అనుకున్నారంతా. ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా ఎగిరి గంతేసినంత పని చేశాడు.
ముందు చెప్పినట్లు అన్నీ అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ కాదు కదా. బిస్లా శతకానికి చేరువైన వేళ మోర్కెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో చెన్నై బౌలర్లు ఓవైపు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ, మరోవైపు కీలక సమయాల్లో వికెట్లు తీశారు. అనంతరం లక్ష్మీరతన్ శుక్లా (3), యూసుఫ్ పఠాన్ (1) సైతం విఫలమయ్యారు. ఇక కలిస్ పోరాడినా విజయానికి చేరువలో ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా విజయానికి 8 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఎలాంటి డ్రామాకు ఆస్కారం ఇవ్వకుండా మనోజ్ తివారి (9*) రెండు ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని, ట్రోఫీని అందించాడు.
బిస్లా ఏం చేస్తున్నాడో...
మొదట్లో చెప్పుకున్నట్లు బిస్లా... ఫైనల్ మ్యాచ్‌కు జట్టులోకి రావడం చాలా మందికి రుచించలేదు. ఆ సమయంలో ట్విటర్లో పోల్ పెడితే... బిస్లా రావడం జట్టుకు ఉపయోగకరంగా ఉండదు అంటూ 75 శాతం మంది అభిప్రాయం చెప్పారట. కానీ అదే బిస్లా జట్టుకు విజయాన్ని అందించాడు. అన్నట్లు, అప్పటివరకు టోర్నీలో బిస్లా మెరిపించిన మెరుపులు ఒకటో, రెండో. కానీ అవసరమైన సమయంలో గట్టిగా మెరిశాడు. ఆ తర్వాతి ఏడాది కూడా కోల్‌కతాకే ఆడిన బిస్లా 14 మ్యాచ్‌ల్లో 255 పరుగులు చేశాడు. 2015లో కోల్‌కతా నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డ్రాఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత బిస్లాను ఏ జట్టూ తీసుకోలేదు. అయితే ఆఖరిగా 2020లో లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో కింగ్స్ తరఫున ఆడాడు.
ఈ మ్యాచ్‌ను ప్రేరణగా తీసుకుంటే..
(Photo: KKR Twitter)
నాటి మ్యాచ్‌ను కోల్‌కతా ఆటగాళ్లు నేడు ప్రేరణగా తీసుకుంటే మరోసారి చెన్నైకి షాకిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈసారి కూడా కోల్‌కతా.. చెన్నైకి దీటుగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా చెన్నైకి రుతురాజ్ ఉంటే ఇక్కడ వెంకటేశ్ అయ్యర్ మెరుస్తున్నాడు. తర్వాత ధోనీసేనలో డుప్లెసిస్, ఉతప్ప, అంబటి రాయుడు లాంటి బ్యాట్స్‌మెన్ రాణిస్తుంటే.. మోర్గాన్ టీమ్‌లో శుభ్‌మన్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి ఉన్నారు. అటు చెన్నై బౌలింగ్‌లో దీపక్ చాహర్, బ్రావో, శార్దూల్ ఠాకూర్ లాంటి పేసర్లు ఉండగా.. కోల్‌కతాలో సునీల్ నరైన్, షకిబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లు ఉన్నారు. దీంతో ఎలా చూసినా రెండు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. చివరగా ఇరు జట్లలోని కెప్టెన్లు రాణించడమే కీలకం కానుంది. ఇటు చెన్నైలో ధోనీ మెరిసినా, అటు కోల్‌కతాలో మోర్గాన్ బ్యాట్ ఝుళిపించినా ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగుతుందో వేచిచూడాలి.
నాటి మ్యాచ్ హైలైట్స్ వీక్షించండి...
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.