Milkha singh: రక్తం కక్కాడు.. పతకాలు గెలిచాడు

పాక్‌ నరమేధంలో తల్లిదండ్రుల్ని చంపేశారు. ఆ శత్రుదేశంలో ఉండలేనని పారిపోయి దిల్లీకి వచ్చాడు. శరణార్థి శిబిరాల్లో బూట్లు తుడిచాడు. దొంగతనాలు చేసి జైలుకెళ్లాడు. సోదరి నగలమ్మి జైలు నుంచి విడిపిస్తే కొత్త జీవితం మొదలుపెట్టాడు. వరుస వైఫల్యాల తర్వాత సైన్యంలో చేరాడు....

Updated : 19 Jun 2021 15:32 IST

జైలుకెళ్లి.. సైన్యంలో చేరి..దేశానికే ఆదర్శంగా మారిన మిల్కా సింగ్‌

దేశవిభజన అనంతరం పాక్‌లో జరిగిన నరమేధంలో తల్లిదండ్రుల్ని చంపేశారు. ఆ శత్రుదేశంలో ఉండలేనని పారిపోయి దిల్లీకి వచ్చాడు. శరణార్థి శిబిరాల్లో బూట్లు తుడిచాడు. దొంగతనాలు చేసి జైలుకెళ్లాడు. సోదరి నగలమ్మి జైలు నుంచి విడిపిస్తే కొత్త జీవితం మొదలుపెట్టాడు. వరుస వైఫల్యాల తర్వాత సైన్యంలో చేరాడు.

అదిగో అక్కడే పరుగుతో ప్రేమలో పడ్డాడు. ఆటతో ‘రొమాన్స్’ చేశాడు. రోమ్‌ ఒలింపిక్స్‌లో 0.1 సెకన్ల తేడాతో కాంస్యం చేజారినా.. కామన్వెల్త్‌లో పతకం తెచ్చిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆసియాలో తిరుగులేదనుకున్న అబ్దుల్‌ ఖలిద్‌ను పాక్‌లోనే చిత్తుచేసి ‘ఫ్లయింగ్‌ సిఖ్‌’గా అవతరించాడు. ఆయనే కోట్లాది మంది  ఆదర్శమూర్తి ‘మిల్కా సింగ్‌’.


పూలపాన్పు కాదు

విజేతల జీవితాల్లో సుఖాలే ఉంటాయని భావిస్తారు. వారు పెట్టి పుట్టారని అనుకుంటారు. ప్రయత్నమే చేయకుండా.. అందరికీ ఆ అదృష్టం ఉండదని నిట్టూరుస్తారు. వారు సాధించే విజయాలు, పతకాలు చూసి.. అబ్బో వారికేంటి! తినడానికి తిండి.. సాధన చేసేందుకు వసతులు ఉంటాయని భ్రమిస్తారు. కానీ విజయం సాధించే ప్రక్రియలో ఎదురైన కష్టాలు.. అనుభవించిన బాధలు.. కార్చిన కన్నీళ్లు.. తగిలిన ఎదురుదెబ్బలు.. గుండెలను పిండేసే ఆర్తనాదాలు ఎవరికీ కనిపించవు. ‘ఫ్లయింగ్‌ సిఖ్’గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్‌ జీవితమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అందుకే ఆయన కోట్లాది మందికి ఆదర్శంగా మారారు. ప్రపంచ క్రీడా పటంలో భారత్‌ను నిలబెట్టారు కాబట్టే ఆయన కన్నుమూస్తే ఇంతగా విలపిస్తున్నారు.


దొంగతనాలు.. జైలుశిక్ష

అవిభాజ్య పంజాబ్‌లోని గోవింద్‌పుర ‘మిల్కా సింగ్‌’ స్వస్థలం. దేశం విడిపోయిన తర్వాత ఆ ప్రాంతం పాక్‌లో ఉండిపోయింది.  నరమేధంలో అతడి తల్లిదండ్రులను దారుణంగా చంపేశారు. 15 ఏళ్ల వయసులో అక్కడ్నుంచి పారిపోయి దిల్లీకి వచ్చాడు. శరణార్థి శిబిరాల్లో జీవితం గడిపాడు. బూట్లు పాలిష్‌ చేసేవాడు. పాత దిల్లీ రైల్వేస్టేషన్‌ వద్ద ఓ దుకాణం క్లీనర్‌గా పనిచేశాడు. మధ్యలో దొంగతనాలు చేస్తూ జైలుకెళ్లాడు. విడిపించేందుకు అతడి సోదరి ఐశ్వర్‌ నగలు అమ్మింది. మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాక నాలుగో సారి 1952లో సైన్యంలో చేరాడు. సికింద్రాబాద్‌లో పోస్టింగ్‌. అక్కడే తనకు పరుగు పరిచయం అయింది.


సైన్యంలో పరుగుపై ప్రేమ

ఐదు మైళ్ల క్రాస్‌ కంట్రీ పరుగులో మిల్కా తొలిసారి పాల్గొన్నాడు. టాప్‌-10లో నిలిస్తే ఒక గ్లాసు పాలు అదనంగా ఇప్పిస్తానని సైనిక కోచ్‌ గురుదేవ్‌ సింగ్‌ మాటివ్వడంతో ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 400 మీటర్ల పరుగు ప్రత్యేక సాధనకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత చరిత్ర సృష్టించడం మొదలైంది. స్వతంత్ర భారత తొలి క్రీడా దిగ్గజంగా ఎదిగాడు. పరుగుల ట్రాక్‌ను ‘గర్భగుడి’గా భావించే మిల్కా దేశానికి అనేక పతకాలు అందించాడు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణపతకాలు కొల్లగొట్టాడు. 1958 కామన్వెల్త్‌లో విజేతగా ఆవిర్భవించాడు. 440 మీటర్ల పరుగులో విజయదుందుభి మోగించాడు. కామన్వెల్త్‌లో వ్యక్తిగత స్వర్ణం ముద్దాడిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల ఫైనల్లో 0.1 సెకను తేడాతో కాంస్యం చేజార్చుకున్నాడు. ఐతే 45.6 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పడం గమనార్హం. ఆ రికార్డు 38 ఏళ్ల పాటు చెక్కుచెదర్లేదు.


పతకాల వరుస

ఎంత గొప్ప వ్యక్తైనా కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోలేరు. మిల్కా జీవితంలోనూ ఇలాగే జరిగింది. ఒక చిన్న తప్పిదంతో ఆయన ఒలింపిక్‌ పతకం చేజార్చుకున్నాడు. ఆ తర్వాత జరిగే 150 మీటర్ల ఫైనల్లో పోటీపడే ఉద్దేశంతో ఆఖర్లో నెమ్మదించాడు. తల్లిదండ్రుల మరణం తర్వాత తన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇదేనన్నాడు. 80 రేసుల్లో 77 సార్లు విజయాలు సాధించిన ఫ్లయింగ్‌ సిఖ్‌కు 1959లో పద్మశ్రీ వచ్చింది. తన 45.6 సెకన్ల రికార్డును బద్దలుకొట్టిన వారికి రూ.2 లక్షలు బహుమతి ఇస్తానని ఆయన ప్రకటించాడు. 1998లో కోల్‌కతా నేషనల్‌ మీట్‌లో పరమ్‌జీత్‌ సింగ్‌ నెగ్గినా డబ్బులు ఇవ్వలేదు. విదేశాల్లో బద్దలు కొడితేనే రికార్డును పరిగణనలోకి తీసుకుంటానని తర్వాత చెప్పాడు. ‘నా రికార్డును బద్దలుకొట్టే భారతీయుడు ఇంకా పుట్టలేదు’ అని 1991లో అనడం గమనార్హం. ఎవరైనా తన రికార్డును బద్దలు కొట్టాలని, ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం తీసుకొస్తే చూడాలని ఆయన కలగన్నారు. మొదటిది జరిగినా అంగీకరించలేదు. రెండోది జరగలేదు.


రక్తం కక్కుతూ.. అపస్మారక స్థితిలోకి..

1956 ఒలింపిక్స్‌ మిల్కా కెరీర్‌ను మలుపుతిప్పాయి. సెలక్షన్‌ ట్రయల్స్‌కు ఒకరోజు ముందే అతడిపై ప్రత్యర్థులు దాడి చేశారు. అయినా అతడు బెర్త్‌ సాధించాడు. ఆ ఒలింపిక్స్‌లో ప్రిలిమినరీ పోటీల్లోనే వెనుదిరగడంతో నిరాశపడ్డాడు. 400 మీటర్ల విజేత చార్లెస్‌ జెన్కిన్స్‌ వద్ద శిక్షణ పద్ధతులు తెలుసుకొని తీవ్రంగా సాధన చేశాడు. చాలాసార్లు రక్తం కక్కుకొని అపస్మారక స్థితిలో పడిపోయేవాడు. 1960లో చిరకాల శత్రువును ఓడించే అవకాశం దొరికింది. రోమ్‌ ఒలింపిక్స్‌కు ముందు పాక్‌లో ఇండో-పాక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ జరిగింది. పాక్‌ స్ప్రింటర్‌ ఖలిద్‌కు అప్పట్లో ఆసియాలోనే వేగవంతమైన పరుగుల వీరుడిగా పేరుంది. 1958లో అతడు ఆసియా స్వర్ణం గెలవడం గమనార్హం.


పాక్‌ ఆటగాడు చిత్తు

తన తల్లిదండ్రులను చంపిన ఆ దేశానికి వెళ్లి పాక్‌ రన్నర్‌ అబ్దుల్‌ ఖలిద్‌తో పోటీపడనని మిల్కా స్పష్టం చేశాడు. కానీ ప్రధాని నెహ్రూ శత్రువుని ఓడించాలని చెప్పడంతో మనసు మార్చుకున్నాడు. 400 మీటర్ల స్వర్ణం గెలవడమే కాకుండా 200 మీటర్ల పరుగులో అబ్దుల్‌ ఖలిద్‌ను చిత్తుగా ఓడించాడు. దాంతో అప్పటి పాక్‌ అధ్యక్షుడు ఆయుబ్‌ ఖాన్‌ లాహోర్‌లో మిల్కాకు ‘ఫ్లయింగ్‌ సిఖ్‌’ బిరుదును ప్రదానం చేశారు. 1964 ఒలింపిక్స్‌ తర్వాత క్రీడలకు వీడ్కోలు పలికిన మిల్కా సైన్యంలో ఉద్యోగాన్నీ మానేసి చండీగఢ్‌లో స్థిరపడ్డాడు. పంజాబ్‌ ప్రభుత్వం తరఫున పనిచేశాడు. పాఠశాలల్లో క్రీడలను తప్పనిసరి చేసేందుకు కృషి మరెంతో మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని