
Virat-Rohit: రవిశాస్త్రి మాటల్లో.. కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్ ఎలా ఉంటారంటే?
ఇంటర్నెట్ డెస్క్: కెప్టెన్‌గా వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ.. ఓ ఆటగాడిగా అదే ఉత్సాహాన్ని కొనసాగించడమే అతడి ముందున్న అతిపెద్ద సవాల్ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వ్యవహార శైలిని రవిశాస్త్రి తనదైన శైలిలో విశ్లేషించాడు. ఆట ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ దూకుడుగా.. డేంజరస్‌గా ఓ బీస్ట్‌లా వ్యవహరిస్తాడని తెలిపాడు. అయితే మైదానం వెలుపల చాలా సాదాసీదాగా ఉంటాడని పేర్కొన్నాడు. అలానే రోహిత్ శర్మ చాలా రిలాక్స్‌గా ఉంటూ జట్టును నడిపిస్తాడని రవిశాస్త్రి చెప్పాడు.
‘‘విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో చాలా దూకుడుగా ఉంటాడు. యుద్ధ వీరుడిలా పోరాడుతాడు. ఒక్కసారి మైదానంలోకి దిగితే సర్వశక్తులూ ఒడ్డి మరీ పోరాటం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆట నుంచి బయటకొచ్చాక మొత్తం మారిపోతాడు. కెప్టెన్‌గా ఇప్పటి వరకు ఆడిన అతడు ప్లేయర్‌గా కూడా అంతే ఎనర్జీతో ఆడాలి. జట్టు విజయం కోసం మరిన్ని పరుగులు చేయాలి. ఇదే కోహ్లీ ముందున్న అసలైన సవాల్. ఇక రోహిత్ శర్మ విషయానికొస్తే.. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. గేమ్‌ను తన అధీనంలోకి సులువుగా తెప్పించుకోగలడు. ‘దేవుడు నాకు ఈ బహుమతి ఇచ్చాడు. కష్టపడి పనిచేయనివ్వండి’ అని రోహిత్ భావిస్తూ ఉంటాడు. మంచి ఊపులో ఉన్నప్పుడు అతడిలా బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ’’ అని వివరించాడు.
విరాట్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి: జాంటీ రోడ్స్
అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి బయటపడిన విరాట్ కోహ్లీతో ప్రత్యర్థి జట్లు అప్రమత్తంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ జాంటీ రోడ్స్ హెచ్చరించాడు. తనను తాను నిరూపించుకునేందుకు కోహ్లీ భారీగా పరుగులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ‘‘నాయకత్వ బాధ్యతలు లేని కోహ్లీని చూస్తే కొంచెం ఆందోళన పడతా. అదేదో అతడికి భారం దిగిందని కాదు. ఒత్తిడి లేకపోతే భారీగా పరుగులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. టెస్టు కెప్టెన్‌గా దిగిపోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమే. అతడు పూర్తిగా ఆటకు వీడ్కోలు చెప్పలేదు. చాలా మంది సారథులు రిటైర్మెంట్ ప్రకటించగానే ఆటను వదిలేసి వెళ్లారు. అయితే కోహ్లీ అలా కాకుండా ఇంకా జట్టు కోసం పరుగులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అని తెలిపాడు.