Pak Cricket: పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం మాట్లాడినా మీడియాకు చేరుతోంది: మాజీ క్రికెటర్

ప్రపంచ కప్‌ ముందు ప్రధాన కోచ్‌గా వచ్చిన గ్యారీ కిరిస్టెన్‌ను సరిగ్గా వినియోగించుకోవడంలో పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు ఘోరంగా విఫలమైంది.

Updated : 21 Jun 2024 13:38 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ నుంచి లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లకుండా వేరే దేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్‌ టీమ్‌లో ఐక్యత లేదని కోచ్‌ గ్యారీ కిరిస్టెన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే, తాను ఎక్కడా బహిరంగంగా వ్యాఖ్యానించలేదని కిరిస్టెన్ వివరణ ఇవ్వడం గమనార్హం. అయినా, అతడి వ్యాఖ్యలు బయటకు రావడంపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. పాక్‌ క్రికెటర్ల గురించి ఏం మాట్లాడినా ఆ దేశ మీడియాకు చేరుతుందని వ్యాఖ్యానించాడు.  

‘‘పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు సంబంధించి సీక్రెట్లను దాచడం చాలా కష్టం. ఏం మాట్లాడినా ఆ దేశ మీడియాకు లీక్‌ అయిపోతుంది. తాను ఏం మాట్లాడలేదని గ్యారీ కిరిస్టెన్ వివరణ ఇచ్చాడు. ఏదిఏమైనా సరే ఆ వ్యాఖ్యలు మరో మార్గంలో బయటకు వచ్చి ఉంటాయి’’ అని చోప్రా తెలిపాడు. 

పాక్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడుకున్న వ్యాఖ్యలు బయటకు రావడంపై  క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా సోషల్ మీడియా వేదికగా ఖండించాడు. ‘‘ఆటగాళ్లు, సిబ్బంది అంతా ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణ లీక్‌ కావడం సరైంది కాదు. అభద్రతాభావంతోనే ఇదంతా చేసినట్లు అనిపిస్తోంది. ఇది తప్పకుండా గ్యారీ కిరిస్టెన్‌ నేర్చుకోవాల్సిన అంశం. అతడి నుంచి పాక్‌ జట్టు ప్రయోజనం పొందుతుందని భావిస్తున్నా. అద్భుతమైన నైపుణ్యం, జ్ఞానం కలిగిన వ్యక్తి. భారత్‌తో కలిసి పనిచేసినప్పుడు సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. వారితో కలివిడిగా ఉంటూ అద్భుతమైన ఫలితాలు సాధించాడు’’ అని భోగ్లే పోస్టు చేశాడు.

సెలక్షన్ కమిటీలో మార్పులు!

ఘోర ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టులో సమూల మార్పులు చేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు నెలల కిందట ఏర్పాటైన సెలక్షన్ కమిటీపై తొలి వేటు పడే అవకాశం ఉంది. పీసీబీ ఛైర్మన్ మోసిన్‌ నక్వీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని.. పీసీబీ పనితీరుపైనా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు బాబర్‌ అజామ్‌ను సారథిగా తొలగించకపోయినా.. జట్టులో మాత్రం కొత్తవారికి అవకాశం దక్కనుందని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

బాబర్‌.. అంత విలువైన కార్‌ ఎక్కడిది?

పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ ‘ఆడి’ కారుతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దారితీసింది. అయితే, తన సోదరుడు బహుమతిగా ఇచ్చాడంటూ బాబర్ స్పందించాడు. పాక్‌కు చెందిన ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. అంత విలువైన గిఫ్ట్‌ ఇవ్వడానికి మీ సోదరుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. చిన్న జట్లపై ఓడిపోవడంతోనే ఇలాంటి ఖరీదైన బహుమతులు వస్తాయంటూ విమర్శలు గుప్పించాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు పాక్‌ క్రికెట్‌లో పెనుదుమారం రేపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని