David Johnson: నాలుగో అంతస్తు నుంచి దూకి.. మాజీ క్రికెటర్‌ ఆత్మహత్య!

భారత్ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడనప్పటికీ.. దేశవాళీలో మాత్రం అతడి పేరు అందరికీ సుపరిచితమే. అలాంటి మాజీ క్రికెటర్ నాలుగో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. 

Published : 20 Jun 2024 17:08 IST

(ఫొటో సోర్స్‌: ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ డేవిడ్‌ జాన్సన్ (52) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. బెంగళూరులోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందపడటం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరణించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

‘‘అపార్ట్‌మెంట్‌లోని నాలుగో ఫ్లోర్‌లో జాన్సన్ ఉంటారు. అతడు బాల్కనీలో నుంచి కిందపడిపోయినట్లు సమాచారం అందింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జాన్సన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు’’ అని కేఎస్‌సీఏ ప్రకటించింది. జాన్సన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బలవన్మరణమా..?

జాన్సన్‌ తాను ఉండే ఇంటికి సమీపంలోనే ఓ కోచింగ్ అకాడమీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే, అదేమీ సరిగ్గా నడవకపోవడంతో నష్టాలు వచ్చాయి. దాంతో మానసికంగా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలూ తలెత్తడంతో జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘‘కొత్తనూర్‌లోని కనకశ్రీ లేఔట్‌లోని అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు నుంచి జారి పడినట్లు మాకు సమాచారం అందింది. అయితే, అక్కడి పరిస్థితులను చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానంగా ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

భారత్ తరఫున రెండు టెస్టులు ఆడిన జాన్సన్.. 39 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటక క్రికెట్ సంఘం బౌలింగ్‌ యూనిట్‌లో కీలక పాత్ర పోషించాడు. భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, దొడ్డ గణేశ్ తదితరులతో కలిసి ఆడాడు. ఈ సందర్భంగా జాన్సన్ మృతిపై మాజీలు షాక్‌కు గురయ్యారు. తమ సంతాపాన్ని తెలియజేశారు. 

‘‘టెన్నిస్‌ క్రికెట్‌ రోజుల నుంచి మేం కలిసి ఆడాం. జై కర్ణాటక క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాం. ఇలాంటి వార్త షాకింగ్‌గా అనిపిస్తోంది. రాష్ట్రం కోసం, దేశం కోసం కలిసి ఆడిన అనుభవం ఉంది. చాన్నాళ్లు భారత బౌలింగ్‌ ఎటాక్‌కు చిరునామాగా కర్ణాటక ఉండేది. ఒకే రాష్ట్రం నుంచి ఆరుగురం భారత జట్టుకు ఆడేవాళ్లం. అప్పుడు రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నాడు’’ - దొడ్డ గణేశ్‌

‘‘నా క్రికెట్ సహచరుడు జాన్సన్ మృతి అత్యంత బాధాకరం. చాలా త్వరగా వెళ్లిపోయావు ‘బెన్నీ’. అతడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’’ - అనిల్ కుంబ్లే

‘‘భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ మృతికి సంతాపం వెల్లడిస్తున్నా. దేశ క్రికెట్‌ కోసం అతడి సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ - జైషా, బీసీసీఐ కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని