Deepak - Virat : దీపక్‌కు అంత సులువేం కాదు.. కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు!

 ఇంకో రెండు రోజుల్లో జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సీనియర్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీతోపాటు...

Published : 16 Aug 2022 18:01 IST

టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ మణిందర్‌ సింగ్

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంకో రెండు రోజుల్లో జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సీనియర్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీతోపాటు రెగ్యులర్‌ సారథి రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్‌ తదితరులకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. కేఎల్ రాహుల్‌, శిఖర్‌, రుతురాజ్‌, గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ వంటి బ్యాటర్లు ఉన్నారు. అదేవిధంగా చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని దీపక్‌ చాహర్‌ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌తోపాటు ఆసియా కప్‌నకూ ఎంపికయ్యాడు. అయితే దీపక్ చాహర్‌ ప్రదర్శన ఎలా ఉంటుందోననే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి చాహర్‌ మైదానంలోకి దిగలేదు. ఈ క్రమంలో చాహర్‌ పునరాగమనంపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ మణిందర్‌ సింగ్ ప్రత్యేకంగా విశ్లేషించాడు. 

‘‘గాయం కారణంగా చాలా రోజులపాటు దీపక్ చాహర్  క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ ఫామ్‌లోకి రావడం సులువేం కాదు. అందుకు ఎంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. అతడిని ఎక్కడ వాడుకోవాలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు. అతడు చాలా టాలెంట్‌ కలిగిన ఆటగాడు’’ అని వివరించాడు. జింబాబ్వే కన్నా ప్రస్తుతం పర్యటనకు వచ్చిన టీమ్‌ఇండియా ఎంతో బలంగా ఉందన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే ఆత్మవిశ్వాసంతో ఉందనీ.. అందుకే పోటీనిస్తామనే యాటిట్యూడ్‌ను ప్రదర్శిస్తోందని మణిందర్ పేర్కొన్నాడు.

అలాగే విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంపైనా మణిందర్‌ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ లాంటి ఆటగాడు విశ్రాంతి కావాలని కోరుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. దీనిపై సెలెక్టర్లు, కోహ్లీ మధ్య సరైన అవగాహన ఉందని అనుకుంటున్నా. నెట్స్‌లో గంటలు తరబడి శ్రమించాడని గత భారత టీ20 లీగ్ సమయంలో నేనొక మాట విన్నా. అయితే.. ఇంత చేసినా తన స్థాయి ఆటను ఆడటంలో విఫలమయ్యాడు. అవే తప్పులు చేస్తూ ఉన్నాడు. అందుకే కొందరు మాజీ ఆటగాళ్లు కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. దీంతో కోహ్లీనే విరామం తీసుకుని ఉత్సాహంతో తిరిగి రావాలని భావించి ఉంటాడు. ఎవరికైనా మానసిక స్థైర్యం ఎంతో ముఖ్యం. విరాట్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఫిజికల్‌గా ఫిట్‌ ఉండే అతడికి మళ్లీ తన ఫామ్‌ అందుకోవడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ సరిపోతుంది’’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని