Unmukt Chand: ఉన్ముక్త్‌ చంద్‌ కంటికి తీవ్ర గాయం

అండర్‌ -19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ కంటికి తీవ్ర గాయమైంది. ఈ మేరకు ఫొటోలను తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. 

Published : 02 Oct 2022 01:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సీనియర్‌ జాతీయ జట్టులోకి అడుగు పెట్టకుండానే భారత క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన ఉన్ముక్త్ చంద్.. మరోసారి వార్తల్లో నిలిచాడు. కెప్టెన్‌గా అండర్‌-19 ప్రపంచకప్‌ను టీమ్ఇండియాకు అందించిన ఉన్ముక్త్‌ చంద్‌.. తాజాగా తన కంటికి తీవ్ర గాయమైనట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. అయితే దేవుడి దయ వల్ల చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపాడు. ‘‘క్రీడాకారుడి ప్రయాణం ఎల్లవేళలా సాఫీగా ఉండదు. కొన్నిసార్లు విజయంతో ఇంటికి వస్తారు. మరికొన్నిసార్లు ఓటములు తప్పవు. అలాగే గాయాలూ తప్పవు. అయితే దేవుడి దయ వల్ల పెను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే అథ్లెట్లు కష్టపడి ఆడేటప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు. ఓ మ్యాచ్‌ సందర్భంగా జరిగినట్లు తెలుస్తోంది.

కేవలం 28 ఏళ్ల వయసులోనే గతేడాది భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉన్ముక్త్ చంద్.. అమెరికాలో మేజర్‌ లీగ్‌ క్రికెట్‌తో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకొన్నాడు. జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో అమెరికా నుంచి లీగ్‌ల్లో ఆడేందుకు ఆఫర్‌ రావడంతో ఉన్ముక్త్‌ భారత క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకొన్నాడు. అలాగే బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయ క్రికెటర్‌ కూడా ఉన్ముక్త్‌ కావడం విశేషం. మెల్‌బోర్న్‌ రెనెగెడెస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని