Irfan Pathan: అతడు టీమ్‌ఇండియాకు రిజర్వ్‌ బ్యాంక్ లాంటోడు: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్‌ 2024లో అదరగొడుతున్న జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 

Published : 24 Jun 2024 00:12 IST

ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన టోర్నీల్లో సత్తాచాటుతూ జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించడంలో ముందుంటాడు టీమ్‌ఇండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah). ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)లోనూ బుమ్రా అదరగొడుతున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో బుమ్రా (3/14)తో సంచలన ప్రదర్శన చేశాడు. తర్వాత అఫ్గానిస్థాన్‌పై (4/7), బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (2/13)తో మెరిశాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు భారత జట్టుకు రిజర్వ్‌ బ్యాంకు లాంటోడని కితాబిచ్చాడు. 

‘‘జస్‌ప్రీత్‌ బుమ్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటోడు. అతను పూర్తిగా నమ్మదగిన బౌలర్‌. మ్యాచ్‌లో ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్‌లోనైనా బుమ్రా నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చు. అతను గేమ్‌ని సెట్‌ చేస్తాడు. ప్రస్తుత క్రికెట్‌లో బుమ్రా వలె బౌలింగ్‌ టోన్‌ సెట్‌ చేయడం మరే బౌలర్‌ వల్ల సాధ్యం కాలేదు. భారత బౌలింగ్‌ దళానికి బుమ్రా పెద్దన్న లాంటోడు. అతను నిలకడగా మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు స్లో బాల్స్‌ కూడా సంధిస్తాడు. అవసరమనుకుంటేనే బౌన్సర్లు వేస్తాడు. ఈ ప్రపంచ కప్‌లో ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా రివర్స్‌ కూడా రాబడుతున్నాడు. ఒకవేళ టీమ్‌ఇండియా ఈ ప్రపంచ కప్‌ సాధిస్తే అందులో బుమ్రాదే ప్రధాన పాత్ర అవుతుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని