SKY : సూర్యకుమార్‌ యాదవ్‌.. నయా ‘360’ డిగ్రీల ప్లేయర్‌: స్కాట్ స్టైరిస్‌

విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో (76) భారత్‌ను గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై..

Published : 05 Aug 2022 15:34 IST

(ఫొటో సోర్స్‌: సూర్యకుమార్‌ యాదవ్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో (76) భారత్‌ను గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలానే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకుకు ఎగబాకాడు. 31 ఏళ్ల వయసులో ఆలస్యంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సూర్యకుమార్‌ బ్యాటింగ్‌లో చెలరేగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోదగిన ప్లేయర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో పొట్టి ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ కీలక బ్యాటర్‌గా మారతాడని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత ఓపెనర్‌గా సూర్యకుమార్‌ రావడం.. తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నాడు. ఒకప్పటి ‘360’ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో సూర్యకుమార్‌ను పోల్చడం విశేషం.

‘‘ఉత్తమంగా ఆడే ఆటగాళ్లను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపినా రాణిస్తారు. అందుకే సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనింగ్‌కు దిగినప్పుడు నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. కానీ ఇక్కడొక సమస్య కనిపిస్తోంది. అతడిని ఓపెనర్‌గానే ఆడిస్తారా..? లేకపోతే మూడు లేదా నాలుగో స్థానంలో ఆడిస్తారా..? అనేది అంతుచిక్కని ప్రశ్న. అయితే సీనియారిటీని బట్టి నాలుగో స్థానంలో దింపే అవకాశాలు లేకపోలేదు. సూర్య విభిన్న షాట్లు కొట్టగల సమర్థుడు. 360 డిగ్రీల్లో షాట్లు ఆడే సత్తా ఉంది. ఏదో సంప్రదాయబద్ధంగా ఆడదామనే బ్యాటర్‌ మాత్రం కాదు. అందుకే ప్రస్తుతం ఉన్న బ్యాటర్లలో అతడికే సానుకూల అంశాలు అధికంగా ఉన్నాయి. బౌలర్‌ ఎవరనేది కాకుండా మైదానం నలుమూలల ఆడటం అతడి బలం’’ అని స్కాట్ స్టైరిస్‌ కొనియాడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని