Team India: ఇలాంటి బౌలర్‌ ప్రపంచకప్‌ జట్టులో లేకపోవడం దురదృష్టకరం: జాఫర్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో (Ban vs Ind) ఐదు వికెట్లతో అదరగొట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌ను (Kuldeep Yadav) సీనియర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వసీం జాఫర్‌ (Wasim Jaffer), దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik).. కుల్‌దీప్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.  

Updated : 29 Jun 2023 16:26 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో అద్భుతమైన బౌలింగ్‌తో కుల్‌దీప్‌ యాదవ్‌ అదరగొట్టాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి బంగ్లా కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌ను టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్, సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి ఆటగాడిని గత టీ20 ప్రపంచకప్‌లో చూడలేకపోవడం దురదృష్టకరమని జాఫర్‌ వ్యాఖ్యానించాడు. రానున్న రోజుల్లో కుల్‌దీప్‌ టీమ్‌ఇండియాకు మంచి ఆయుధంగా మారాడని డీకే అన్నాడు.

కుల్‌దీప్‌ బౌలింగ్‌ను చూడటం చాలా ఉత్సాహంగా ఉంది. నేను ఇంతకుముందే చెప్పినట్లు అతడు గత టీ20 ప్రపంచకప్‌లో భాగం అయి ఉంటే బాగుండేది. అయితే, దురదృష్టవశాత్తూ అక్కడ అతడిని మనం చూడలేకపోయాం. భారత టీ20 లీగ్‌ గత సీజన్‌లో అతడి బౌలింగ్‌ను చూసిన తర్వాత కచ్చితంగా స్క్వాడ్‌లోకి వస్తాడని భావించా. అయితే, ఆశ్చర్యకరంగా జట్టులో స్థానం దక్కలేదు. రానున్న ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కుల్‌దీప్‌ కీలక పాత్ర పోషిస్తాడు. భారత బౌలింగ్‌ దాడికి కుల్‌దీప్‌ ప్రత్యేకతను తీసుకొస్తాడు. టీ20 లీగ్‌లో టాప్‌ బ్యాటర్లకు అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. భారత పరిస్థితులకు సరిగ్గా సరిపోతాడు

- జాఫర్

టీమ్‌ఇండియా చేతిలో బలమైన ఆయుధం.. 

షకిబ్‌ అల్‌ హసన్‌కు అతడు వేసిన తొలి ఓవర్‌ రెండో బంతి నన్ను కట్టిపడేసింది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో షకిబ్‌కు మంచి అనుభవం ఉంది. అలాంటి ఆటగాడిని సైతం కుల్‌దీప్‌ ఇరుకున పెట్టాడు. అతడిది నిజంగా అద్భుతమైన బౌలింగ్‌. ఈ బంతి అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అద్భుతమైన స్పెల్‌ వేసేందుకు నాంది పలికింది. అక్కడి నుంచి కుల్‌దీప్‌ తన జోరు చూపించాడు. గొప్ప బ్యాటర్లను సైతం పెవిలియన్‌ బాట పట్టేలా చేశాడు. ఆ బంతి ఆడిన తర్వాత మైదానంలోకి వచ్చిన బ్యాటర్ల ఆటతీరు చూస్తే వారిని కుల్‌దీప్‌ ఎంతగా ఇబ్బంది పెట్టాడో అర్థమవుతుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ ముంగిట ఆటగాళ్లకు ఈ స్కోరు మరింత ఉత్సాహాన్నిస్తుంది. రానున్న రోజుల్లో కుల్‌దీప్‌ టీమ్‌ఇండియాకు మంచి ఆయుధంగా మారనున్నాడు

- దినేశ్‌ కార్తిక్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని