
Virat Kohli: కోహ్లీ విషయంలో బీసీసీఐది పెద్ద పొరపాటే: పాక్ మాజీ కెప్టెన్
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కోహ్లీ విషయంలో బీసీసీఐ అతిపెద్ద పొరపాటు చేసిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు. తొలగించిన విధానం సరిగాలేదని పేర్కొన్నాడు. టీ20 సారథ్య బాధ్యతలకు కోహ్లీనే వీడ్కోలు చెప్పగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పేశాడు. విరాట్ తొలగింపు వ్యవహారం టీమ్ఇండియా క్రికెట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోదని లతీఫ్ పేర్కొన్నాడు. ఆర్థిక శక్తితోపాటు సంక్షోభం తట్టుకొనేంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లు బీసీసీఐ వద్ద ఉన్నారని తెలిపాడు.
‘‘ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు భారత క్రికెట్ చరిత్రలో పేలవ చిత్రాన్ని ఆవిష్కరించాయి. అయితే ఇవేవీ ప్రతికూల ప్రభావం చూపవు. ఐపీఎల్లో వారికి బలమైన పునాది ఉంది. అంతేకాకుండా టీమ్ఇండియా క్రికెట్ ఆర్థికంగా చాలా శక్తిమంతమైంది. అందుకే భారతీయ క్రికెట్ బ్రాండ్‌పై ఎటువంటి ప్రభావం చూపవు. అయితే ఇప్పుడంతా రోహిత్ శర్మ జట్టును ఎలా నడుపుతాడనే దానిపైనే దృష్టిసారించే అవకాశం ఉంది. రోహిత్‌కు తనదైన శైలి ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. విరాట్ కోహ్లీ సారథిగా జట్టు సభ్యుల్లో ఉత్తేజం నింపేవాడు’’ అని చెప్పుకొచ్చాడు.
కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించిన విధానమే ఇప్పుడు చర్చకు దారితీసిందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే సారథ్యం నుంచి కోహ్లీని తప్పించడం సరైన మార్గంలో జరగలేదని భావిస్తున్నా. సుదీర్ఘకాలంపాటు కెప్టెన్‌గా సేవలు అందించి ఆ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు లేకపోతే తొలగించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు బోర్డు ఉన్నతాధికారులతో చర్చలు జరపకపోవడమనేది సాధ్యం కాదని వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకున్నా. నేను 2004లో కెప్టెన్సీ నుంచి దిగినప్పుడు మా బోర్డు ఛైర్మన్‌తో మాట్లాడాను. అలానే బీసీసీఐ కూడా ఆ మార్గంలో వెళ్లి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఒక టీమ్‌కు కెప్టెన్‌ను మార్చడం కూడా తేలికైన విషయమేమీ కాదు’’ అని లతీఫ్ వివరించాడు.