Virat Kohli : విరాట్‌లా సుదీర్ఘ ఫామ్‌లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?

విరాట్ కోహ్లీ.. ఈ పేరు గత కొన్నిరోజులుగా మారుమోగుతోంది. ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న..

Updated : 13 Aug 2022 19:44 IST

వివరించిన పాక్‌ మాజీ పేసర్ ఆకిబ్‌ జావెద్

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్ కోహ్లీ.. ఈ పేరు గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ మూడేళ్ల కాలంలో ఒక్క శతకమూ బాదలేదు. అడపాదడపా అర్ధశతకాలను సాధిస్తున్నా.. తన స్థాయికి తగ్గ ఆట మాత్రం ఆడటం లేదనే వాదన బలంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్, ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్, కివీస్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ నిలకడగా ఆడుతుండటంతో విరాట్ ఫామ్‌పై చర్చ కొనసాగుతోంది. 2019 వరకు పరుగుల రారాజుగా కీర్తింపబడిన  కోహ్లీ ర్యాంకింగ్స్‌లోనూ కిందికి జారిపోయాడు. ఈ క్రమంలో విరాట్, అజామ్‌, విలియమ్సన్, రూట్ బ్యాటింగ్ శైలిపై పాక్ మాజీ పేసర్‌ ఆకిబ్ జావెద్‌ స్పందించాడు. ‘గొప్ప ఆటగాళ్ల’ జాబితాలో రెండు రకాల ప్లేయర్లు ఉంటారని పేర్కొన్నాడు. 

‘‘గ్రేట్‌ ప్లేయర్లు రెండు రకాలు. ఒకరేమో బలహీనత వద్ద ఆగిపోయేవారు. కొన్ని ప్రాంతాల్లో పడే బంతులను ఆడటంలో ఇబ్బంది పడేవాళ్లు. అలాంటి వారు మిగతా అన్ని బంతులను ఈజీగా ఆడేస్తారు. ఆ ఒక్క చోట మాత్రమే ఇబ్బంది పడతారు. ఇక మరొక రకం.. సాంకేతికంగా అద్భుతంగా ఆడేవారు.. వారి బలహీనతలను కనిపెట్టడం కాస్త కష్టం. బాబర్, కేన్, రూట్ అలాంటి కోవకు చెందినవారు  కోహ్లీ చాలాసార్లు ఆఫ్ స్టంప్‌ ఆవల వేసిన బంతులకు దొరికిపోయాడు. జేమ్స్‌ అండర్సన్ బౌలింగ్‌లో ఇలానే పెవిలియన్‌కు చేరాడు. ఒకవేళ కోహ్లీ కానీ తన తీరును మార్చుకుంటే నేను తప్పకుండా మ్యాచ్‌లు చూస్తా. శరీరానికి దూరంగా వెళ్లే వాటిని ఆడేందుకు ప్రయత్నించకూడదు. టెక్నిక్‌ను అందిపుచ్చుకుంటే మాత్రం సమస్యలన్నీ తీరిపోతాయి. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లను ఆడటం మొదలుపెడితే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు’’ అని జావెద్ తెలిపాడు. 

ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఎవరు ఆధిక్యం సాధిస్తారనేదానిపైనా జావెద్‌ వివరించాడు. ‘‘విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో లేకపోతే మాత్రం భారత్‌పై పాక్‌ ఆధిక్యం కనబరుస్తుంది. గత టీ20 ప్రపంచకప్‌లో ఓటమిలానే మరోసారి టీమ్‌ఇండియాకు పరాభవం తప్పదు. కోహ్లీ పరుగులు సాధిస్తే మాత్రం పాక్‌కు ఓటమిబాట తప్పదు. అంతేకాకుండా కోహ్లీ ఆడకపోతే మాత్రం అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ‘ఇంకా ఎందుకు అతడిని ఆడిస్తున్నారు’.. కోహ్లీ స్థానంలో దీపక్‌ హుడాను ఆడించొచ్చు కదా..? ఇలా వస్తాయి. అయితే యూఏఈ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి విరాట్ తప్పకుండా ఫామ్‌లోకి వస్తాడని నేను భావిస్తున్నా’ అని జావెద్ వివరించాడు. యూఏఈ వేదికగా ఆగస్ట్‌ 28న ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో భారత్‌ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని