IND vs PAK : దాయాదుల పోరులో భారత్‌కే ఎడ్జ్‌.. ఎందుకో చెప్పిన పాక్‌ మాజీ ఆటగాడు

గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియాపై పాక్‌కదే మొట్టమొదటి గెలుపు. అయితే మరోసారి ఇరు జట్లూ...

Published : 19 Aug 2022 11:45 IST

ఇంటర్నెట్ డెస్క్: గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియాపై పాక్‌కదే మొట్టమొదటి గెలుపు. అయితే మరోసారి ఇరు జట్లూ ఆసియా కప్‌ వేదికగా తలపడనున్నాయి. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ మొదలు కానుంది. ఆ మరుసటి రోజే భారత్‌-పాక్‌ జట్ల మధ్య సమరం ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా దాయాది జట్టుపై విజయం సాధించాలనే నిశ్చయంతో ఉంది. మరోవైపు పాక్‌ కూడా మరోసారి భారత్‌పై పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు.. ఏ ఆటగాడు కీలకంగా మారుతారనే విషయాలపై పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా విశ్లేషించాడు.

‘‘ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నా. చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. అలానే బ్యాక్‌ పెయిన్‌తో ఇబ్బంది పడి కోలుకున్న రోహిత్ శర్మ ఆసియా కప్‌లో ఎలా ఆడతాడనేది కీలకం. ఇక పాకిస్థాన్‌ జట్టుకు వస్తే.. నసీమ్‌ షా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. షహీన్‌ షా అఫ్రిదికి ఫిట్‌నెస్‌ సమస్య ఉంది. ఇలా ఇరు జట్ల నుంచి కొందరు గాయాల జాబితాలో ఉన్నారు. అయితే పాకిస్థాన్‌ కంటే భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా టీ20లను టీమ్‌ఇండియా ఆడింది. అందుకే ఈ మ్యాచ్‌లో భారత్‌కు 60 శాతం.. పాకిస్థాన్‌కు 40 శాతం గెలుపు ఛాన్స్‌ ఉంది. టీమ్ఇండియాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే.. ఆ జట్టులో అత్యుత్తమ బౌలింగ్‌ దళం ఉంది. ప్రపంచ స్థాయి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, చాహల్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాతోపాటు ఫాస్ట్‌ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్ ఉన్నారు. వీరంతా అద్భుతాలు చేయగలరు. అయితే షహీన్‌ కోలుకోకపోతే పాకిస్థాన్‌కు నమ్మదగ్గ బౌలర్‌ ఎవరు ఉన్నారనేది ప్రశ్నార్థకం’’ అని కనేరియా వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని