
పంత్ స్కూప్ షాటా.. మజాకా?
ఎవరైనా ఇలా ఆడగలరా? మాజీల ఆశ్చర్యం..
(Photo: BCCI)
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ ఆస్ట్రేలియా పర్యటన వరకూ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కోగా, ఇప్పుడు అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆసీస్ గడ్డపై విధ్వంసక బ్యాటింగ్‌తో పాటు జట్టును గెలిపించిన అతడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడని మాజీలు కొనియాడుతున్నారు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడడమే కాకుండా అవసరమైన వేళ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు పంత్. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరీ ఎప్పటికీ చిరస్మరణీయమే. టీమ్ఇండియా 80/4 స్థితిలో ఉండగా బరిలోకి దిగిన అతడు జట్టు ఆధిక్యంలో నిలిచేవరకు క్రీజులో కొనసాగాడు. ఈ క్రమంలోనే తొలుత నెమ్మదిగా ఆడి తర్వాత తన సహజసిద్ధమై ఆట ఆడాడు. దీంతో 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు సాధించి టెస్టుల్లో వన్డే ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, పంత్ 89 పరుగుల వద్ద ఉండగా అండర్సన్ బౌలింగ్‌లో ఆడిన రివర్స్ స్కూప్ షాట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెంచరీకి చేరువలో ఉన్న వేళ ఎవరైనా ఇలాంటి షాట్ ఆడతారా అనేలా ముక్కున వేలేసుకునేలా చేశాడు. కొత్త బంతితో తనని కట్టడి చేద్దామని చూసిన ఇంగ్లాండ్ పేస్ దిగ్గజాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. స్లిప్ ఫీల్డర్ల తలలపై నుంచి ఆడిన ఆ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దానికి టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్, వసీమ్ జాఫర్, ఆకాశ్ చోప్రాలు స్పందించారు. ఆ షాట్‌ను ఆస్వాదించానని సెహ్వాగ్ పేర్కొనగా, 2021లో అత్యుత్తమ షాట్ అని చోప్రా అభినందించాడు. ఇక వసీమ్ స్పందిస్తూ.. పంత్ ఇలాంటి షాట్ ఆడకూడదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.