Kohli: కోహ్లీకి విశ్రాంతి ఎందుకు..? తీసుకున్నా ప్రయోజనం ఉండదు: మాజీ సెలెక్టర్‌

బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ  వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలోనూ కోహ్లీ (16) మరోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలో విరాట్‌పై...

Updated : 15 Jul 2022 13:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ  వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలోనూ కోహ్లీ (16) మరోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలో విరాట్‌పై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి.  క్రికెట్‌కు కొంతకాలం విరామం తీసుకొని మళ్లీ రావాలని మాజీలు మైకెల్‌ వాన్‌, ఆశిశ్‌ నెహ్రా  సూచించారు. అయితే టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ మాత్రం విభిన్నంగా స్పందించాడు. విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది ఎందుకు చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఒకవేళ విరామం తీసుకున్నా ఫామ్‌పరంగా ఎలాంటి మార్పు రాదని పేర్కొన్నాడు.  

‘‘అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే..? విశ్రాంతి అంటే ఏమిటి...?ఎప్పుడు తీసుకోవాలి..? వందల పరుగులు చేసినప్పుడే విశ్రాంతి గురించి ఆలోచించాలి. ఒక వేళ విరాట్ గత మూడు నెలల్లో నాలుగైదు సెంచరీలు చేసి అలసిపోతే.. అప్పుడు విరామం తీసుకొనే స్వేచ్ఛ ఉండేది. భారత  టీ20 లీగ్‌కు ముందు విరాట్ ఆడింది కేవలం రెండు టెస్టులు మాత్రమే. లీగ్ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కూడా ఆడలేదు. విశ్రాంతి తీసుకొన్నాడు. మైదానం బయట కూర్చోవడం, విశ్రాంతి తీసుకోవడం వల్ల విరాట్ ఫామ్‌లోకి వచ్చేందుకు పెద్దగా ఉపయోగపడదు’’ అని శరణ్‌దీప్‌ సింగ్‌ వివరించాడు. 

అప్పుడు నేను ఇచ్చిన సూచనలు పనిచేశాయి: ముస్తాక్‌ అహ్మద్‌ 

చాలా రోజుల కిందట విరాట్ కోహ్లీకి తాను ఇచ్చిన పలు సూచనలు బాగా పనిచేశాయని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ ముస్తాక్ అహ్మద్‌ గుర్తు చేసుకొన్నాడు. ‘‘ఒకసారి జిమ్‌లో విరాట్ కోహ్లీ శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో నేనూ అక్కడికి వెళ్లా. అప్పుడే విరాట్ నా దగ్గరకు వచ్చాడు. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా.. అతడికి కొన్ని సూచనలు చేశా. తొలి పదిహేను పరుగుల వరకు ఫ్రంట్‌ఫుట్‌ స్ట్రైట్‌గా ఉండాలని చెప్పా. బంతిని డ్రైవ్‌ షాట్‌ కొట్టేటప్పుడు కాలు కూడా ఆ వైపు ఉండేలా చూసుకోవాలని సూచించా. లేకపోతే బంతి బ్యాట్‌కు అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొనే ప్రమాదం ఉందని వివరించా. దాంతో ఇది చాలా మంచి పాయింట్ అని నాతో అన్నాడు. తప్పకుండా దీనిపై ప్రాక్టీస్‌ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో విరాట్ ఇదే పద్ధతిని అమలు చేయడం చూశా’’ అని ముస్తాక్‌ వివరించాడు. 

కోహ్లీ ఫామ్‌ గురించే ఎందుకు అడుగుతారు..? : బట్లర్‌

ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న  విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ మద్దతుగా నిలిచాడు. ఎన్నో ఏళ్లపాటు భారీగా పరుగులు చేసిన కోహ్లీ ప్రదర్శనపై ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం ఎందుకో తనకు అర్థం కావడం లేదని ఆక్షేపించాడు. అతడు కూడా మనిషేనని, తప్పకుండా ఫామ్‌ అందుకుంటాడని బట్లర్‌ చెప్పాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా తమపై ఆడకుండా ఉంటే బాగుంటుందని మాత్రం కోరుకుంటానని తెలిపాడు. విరాట్ అంటే ఏంటో అతడి గణాంకాలే చెబుతాయని, ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడని బట్లర్‌ గుర్తు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని