IPL: ఐపీఎల్‌ భరోసా ఇస్తుంది..

వెస్టిండీస్‌ క్రికెటర్లకు ఐపీఎల్‌ ఇచ్చిన ఆర్థిక భరోసా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఇవ్వలేకపోయిందని మాజీ పేసర్‌ టినోబెస్ట్‌ అన్నాడు. అందుకే విండీస్‌ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు అనాసక్తి చూపిస్తారన్నాడు.

Published : 25 Jun 2021 01:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌ క్రికెటర్లకు ఐపీఎల్‌ ఇచ్చిన ఆర్థిక భరోసా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఇవ్వలేకపోయిందని మాజీ పేసర్‌ టినోబెస్ట్‌ అన్నాడు. అందుకే విండీస్‌ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు అనాసక్తి చూపిస్తారన్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన ఉదాహరణగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌ పేరును ప్రస్తావించాడు.

రసెల్‌ ఐపీఎల్‌ ఆడటం వల్ల భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటాడని, అంత మొత్తం విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఇవ్వలేకపోతోందని బెస్ట్‌ వ్యాఖ్యానించాడు. మరోవైపు రసెల్‌ పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవడానికి కూడా ఇదొక కారణమని అభిప్రాయపడ్డాడు. విండీస్ క్రికెట్‌ బోర్డు ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడమే అందుకు కారణమని వెల్లడించాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్‌కు జరిగిన అతి మంచి, చెడు ఏదైనా ఉందంటే అది ఫ్రాంఛైజీ క్రికెట్‌ మాత్రమే. ఈ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడి భారీ మొత్తం సంపాదించుకుంటారు. ఈ క్రమంలోనే రసెల్‌ ఏటా ఐపీఎల్‌లో ఆడి బాగా సంపాదిస్తున్నాడు. అదే విండీస్‌ తరఫున ఆడితే ఒక్క మ్యాచ్‌కు 2వేల అమెరికన్‌ డాలర్లు చెల్లిస్తారు. విండీస్‌ బోర్డు తమ ఆటగాళ్లకు భారీ మొత్తంలో ఇవ్వలేకపోతోంది. ఎందుకంటే దానికి తగిన విధంగా ఆదాయం రావడం లేదు’ అని బెస్ట్‌ వివరించాడు.

కాగా, ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ గట్టి పోటీ ఇస్తుందని, దాన్నంత తేలిగ్గా తీసిపారేయొద్దని బెస్ట్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ జట్టు ఇప్పటికి రెండుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ ఫేవరెట్‌గా ఉన్నా.. టీ20 క్రికెట్‌లో విండీస్‌ను తక్కువ అంచనా వేయొద్దన్నాడు. ఆ జట్టులో చాలా నైపుణ్యం గల ఆటగాళ్లు ఉన్నారన్నాడు. కాగా, విండీస్‌ 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పరిస్థితుల కారణంగా గత కొన్నేళ్లుగా ఈ పొట్టి ప్రపంచకప్‌ జరగడం లేదు. ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాల్సి ఉన్నా కరోనా పరిస్థితుల కారణంగా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని