IND vs AUS: ముగిసిన నాలుగో రోజు.. మెరిసిన విరాట్.. పట్టు సాధించే దిశగా భారత్‌

భారత్ - ఆసీస్ జట్ల మధ్య నాలుగో టెస్టు (IND vs AUS) మ్యాచ్‌లో బ్యాటర్లు అదరగొట్టారు. అయితే భారత్‌ 91 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లి మరీ మ్యాచ్‌పై పట్టు సాధించింది.

Updated : 12 Mar 2023 17:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ ఆధిక్యం సాధించింది. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (186)తో భారీ శతకంతో టీమ్‌ఇండియా (IND vs AUS) తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ టెస్టుల్లో సెంచరీ చేయడం విశేషం.  ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 91 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. క్రీజ్‌లో కునెమన్, ట్రావిస్‌ హెడ్ (3*) ఉన్నారు. కునెమన్‌ 18 బంతులాడి పరుగుల ఖాతా తెరవకుండా అజేయంగా నిలిచాడు. ఇంకా ఆసీస్‌ 88 పరుగుల వెనుకంజలో ఉంది. ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడిన ఆసీస్‌ ఓపెనర్ ఖవాజా బ్యాటింగ్‌ రాలేదు. గాయం తీవ్రతనుబట్టి చివరి రోజు అతడు ఆడతాడో... లేదోననేది క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంటుంది.

డబుల్‌ మిస్‌ అయినా.. 

చాలా రోజుల తర్వాత విరాట్‌ కోహ్లీ  చాలా సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడటం విశేషం. ఇదే క్రమంలో సెంచరీ పూర్తి చేసి ద్విశతకం వైపు సాగిన విరాట్‌కు ఆసీస్‌ కట్టుదిట్టంగా బంతులను సంధించింది. ఓ వైపు వికెట్లు పడిపోతుండటంతో దూకుడుగా ఆడే క్రమంలో విరాట్ పెవిలియన్‌కు చేరాడు. డబుల్‌ సెంచరీ మిస్‌ అయినప్పటికీ అభిమానుల మనస్సును గెలుచుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో విరాట్‌తోపాటు శుభ్‌మన్‌ గిల్ (128) శతకం బాదాడు.  అక్షర్‌ పటేల్ (79) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక శ్రీకర్‌ భరత్ (44), పుజారా (42) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్ లయన్‌, టాడ్ మర్ఫీ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్‌, కునెమన్‌ చెరో వికెట్ తీశారు.

చివరి రోజు ఆట తిప్పేస్తారా..?

ఇప్పుడిక భారత బౌలర్ల చేతిలోనే అంతా ఉంది. ప్రస్తుతం 88 పరుగులు వెనుకబడి ఉన్న ఆసీస్‌ను చివరి రోజు  ఎంత త్వరగా ఔట్‌ చేయగలిగితే.. అప్పుడు మ్యాచ్‌ను భారత్‌ తన చేతుల్లోకి తీసుకోగలదు. సోమవారం ఆటలో తొలి సెషన్‌ కీలకంగా మారుతుంది. 150 లోపే కట్టడి చేస్తే మాత్రం భారత్‌ విజయం సాధించడం తేలికవుతుంది. అప్పుడు శ్రీలంక - కివీస్‌ సిరీస్‌ ఫలితంతో సంబంధం లేకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా చేరడానికి మార్గం సుగమమవుతుంది. 

శ్రేయస్‌కు గాయం

నడుము నొప్పి మళ్లీ తిరగబెట్టడంతో శ్రేయస్‌ అయ్యర్ బ్యాటింగ్‌కు కూడా దిగలేకపోయాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లను కోల్పోయినప్పటికీ ఆలౌట్‌గా పరిగణించాల్సి వచ్చింది. ఇదే మ్యాచ్‌తోపాటు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కూ శ్రేయస్‌ ఆడటం కష్టమే. అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌కు వచ్చాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు