నాలుగో టెస్టుపై నీలి నీడలు..

బ్రిస్బేన్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య ఈనెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా అక్కడ మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడమే...

Published : 08 Jan 2021 10:57 IST

సిడ్నీ: బ్రిస్బేన్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య ఈనెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా అక్కడ మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడమే అందుకు కారణం. ఇప్పటికే ఆ నగరంలో యూకే స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసును గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై అటు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సైతం కంగారు పడుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

మరోవైపు బ్రిస్బేన్‌ టెస్టుకు ముందు అక్కడ భారత ఆటగాళ్లకు కఠిన క్వారంటైన్‌ ఆంక్షలు సడలించాలని బీసీసీఐ గురువారమే సీఏకు లేఖ రాసింది. ఈలోపే ఆ నగరంలో లాక్‌డౌన్‌ విధించడం గమనార్హం. కొత్త వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో మరోసారి ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితమవ్వడం కష్టంగా ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. ఈ పర్యటనకు ముందు సీఏతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎక్కడా వేర్వేరు నగరాల్లో ఆటగాళ్లు పలుమార్లు కఠినమైన క్వారంటైన్‌లో ఉండాలని చెప్పలేదని బీసీసీఐ అందులో ప్రస్తావించింది. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో టెస్టుపై సీఏ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి.

ఇవీ చదవండి..
నాలుగో టెస్టుకు ఆంక్షలు సడలించాలి
స్మిత్‌ శతకం.. ఆస్ట్రేలియా 338 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని