Euro 2024: పోర్చుగల్‌ షూటౌట్‌

ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్‌షిప్‌ను ఓటమితో ముగించాడు.

Published : 07 Jul 2024 03:36 IST

సెమీఫైనల్లో ఫ్రాన్స్‌
యూరోలో ముగిసిన రొనాల్డో ఆట

ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్‌షిప్‌ను ఓటమితో ముగించాడు. అతడి జట్టు పోర్చుగల్‌.. హోరాహోరీగా సాగిన యూరో క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. షూటౌట్లో అదరగొట్టిన ఫ్రాన్స్‌ మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది.

హాంబర్గ్‌

ప్రతిష్టాత్మక యూరో ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను అభిమానులు ఇక చూడలేరు. అతను శుక్రవారం రాత్రి తన చివరి మ్యాచ్‌ ఆడేశాడు. రొనాల్డో ఓటమితో తన యూరో కెరీర్‌ను ముగించాడు. క్వార్టర్‌ ఫైనల్లో అతడి జట్టు పోర్చుగల్‌ విజయం కోసం గట్టిగానే పోరాడినా, బలమైన ఫ్రాన్స్‌ను నిర్ణీత సమయంలో నిలువరించగలిగినా.. పెనాల్టీ షూటౌట్లో ఆ జట్టుకు తలవంచింది. నిర్ణీత, అదనపు సమయంలో గోల్స్‌ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో.. పోర్చుగల్‌ 5-3తో విజయం సాధించింది. ఇరు జట్లూ రక్షణాత్మకంగా ఆడడంతో నిర్ణీత 90 నిమిషాల్లో, ఇంజురీ టైంలో.. ఆ తర్వాత అదనపు సమయంలో ఎవ్వరూ గోల్‌ కొట్టలేకపోయారు. దీంతో షూటౌట్‌ అనివార్యమైంది. అందులో ఫ్రాన్స్‌ తరఫున ఔస్మాన్‌ డెంబెల్, యూసుఫ్‌ ఫొఫానా, జూల్స్‌ కౌండె వరుసగా గోల్స్‌ కొట్టారు. పోర్చుగల్‌ తరఫున షూటౌట్లో తొలి షాట్‌ను తనే కొట్టి రొనాల్డో గోల్‌ సాధించి జట్టుకు శుభారంభాన్నందించాడు. ఆ తర్వాత బెర్నార్డో సిల్వా కూడా స్కోర్‌ చేశాడు. కానీ మూడో ప్రయత్నంలో జావో ఫెలిక్స్‌ కొట్టిన షాట్‌ గోల్‌ బార్‌కు తగలడంతో పోర్చుగల్‌ వెనుకబడింది. తర్వాత ఫ్రాన్స్‌ తరఫున బ్రాడ్లీ, పోర్చుగల్‌ నుంచి నును మెండెస్‌ సఫలమయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య ఫ్రాన్స్‌ తరఫున చివరి షాట్‌ ఆడిన థియో హెర్నాండెజ్‌ గోల్‌ సాధించడంతో ఆ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో బృందానికి కన్నీళ్లు తప్పలేదు. మ్యాచ్‌ అనంతరం ఏడుస్తున్న 41 ఏళ్ల సీనియర్‌ ఆటగాడు పెపెను ఓదారుస్తూ రొనాల్డో కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫ్రాన్స్‌ సూపర్‌ స్టార్‌ ఎంబాబె షూటౌట్‌కు అందుబాటులో లేడు. మ్యాచ్‌ మధ్యలోనే అతడి స్థానంలోకి మరో ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. 20 ఏళ్ల యూరో కెరీర్లో రొనాల్డో ఒక టైటిల్‌ సాధించాడు. 2016లో పోర్చుగల్‌.. ఫ్రాన్స్‌నే ఓడించి టైటిల్‌ అందుకుంది. ఇప్పటికే అయిదు ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో.. 2026 టోర్నీలో కూడా ఆడాలని చూస్తున్నాడు. అప్పటికి అతడికి 41 ఏళ్లు వస్తాయి. ఫ్రాన్స్‌ 2021 యూరో క్వార్టర్స్, 2022 ప్రపంచకప్‌ ఫైనల్‌లో షూటౌట్లోనే ఓడిపోయింది. ఇప్పుడు షూటౌట్‌ అడ్డంకిని అధిగమించిన ఆ జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. ఫైనల్లో చోటు కోసం ఫ్రాన్స్, స్పెయిన్‌ ఢీకొంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని