IPL 2021: ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతికి ఫ్రాంచైజీల మొగ్గు!

రొటేషన్‌ పద్ధతిలో మ్యాచ్‌లను ఆడేంచేందుకు ఫ్రాంచైజీల ఆలోచనలు

Published : 25 Sep 2021 01:19 IST

దుబాయ్‌: మొన్నటి వరకూ ఇంగ్లాండ్‌లో చల్లని వాతావరణం.. ఇప్పుడు యూఏఈలో భరించలేని వేడి.. ఇదీ ఐపీఎల్‌ కోసం యూఏఈ చేరుకున్న భారత ఆటగాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులు.. ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోవడం, బయోబబుల్‌లో కొనసాగుతుండటం, వరుసగా మ్యాచ్‌లు ఆడటం వంటి కారణాలతో క్రికెటర్లపై పనిభారం పెరిగిపోయింది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు తీరికలేకుండా అంతర్జాతీయ స్థాయి నుంచి లీగ్‌ల వరకు ఆడేస్తున్నారు. విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లను ఆడటం వల్ల ఇటు శారీరకంగా.. అటు మానసికంగా అలసిపోయే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 2021 రెండో ఎడిషన్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. విజయం కోసం అన్ని జట్లూ తీవ్రంగా పోరాడుతున్నాయి. ఐపీఎల్ ముగిశాక ప్రపంచకప్‌ పోటీలు షురూ కానున్నాయి. అసలే తీరిక లేని షెడ్యూల్‌తోపాటు యూఏఈలో ఉండే వేడి పరిస్థితులతో క్రికెటర్లు చాలా త్వరగా అలసటకు గురవుతున్నారు. దీంతో ఆటగాళ్లను ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. క్రికెటర్ల పనిభారం తగ్గించేలా రొటేషన్‌ పద్ధతిలో మ్యాచ్‌ల్లో ఆడించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే రొటేషన్‌ పద్ధతికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ఇవ్వలేదని, నిర్ణయం తీసుకోవడం పూర్తిగా ఫ్రాంచైజీల ఇష్టమని బీసీసీఐ స్పష్టం చేసింది. ‘పనిభారం నిర్వహణకు సంబంధించి ఫ్రాంచైజీలకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అది పూర్తిగా ఆటగాడు, ఫ్రాంచైజీకి సంబంధించిన అంశం. ఎవరైనా ఒక క్రికెటర్‌కు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే.. ఫ్రాంచైజీతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. అలానే క్రీడాకారులను ఎలా చూసుకోవాలో ఫ్రాంచైజీలకు తెలుసు’అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని