French Open 2022: మట్టికోట మహారాజు రఫెల్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ కైవసం

మట్టికోటలో తనకెవరూ సాటిలేరని మరోసారి నిరూపించాడు రఫేల్‌ నాదల్‌. 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు........

Updated : 05 Jun 2022 21:44 IST

పారిస్‌: మట్టికోటలో తనకెవరూ సాటిలేరని మరోసారి నిరూపించాడు రఫెల్‌ నాదల్‌. 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాస్పర్‌ రూడ్‌ను ఓడించి 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడాడు. రూడ్‌(నార్వే)తో జరిగిన ఫైనల్‌ పోరులో నాదల్‌ (స్పెయిన్‌) 6-3, 6-3, 6-0 తేడాతో వరుస సెట్లలో గెలుపొంది రోలాండ్‌ గారోస్‌లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

మొదటి సెట్‌ను సునాయాసంగా గెలుపొందిన ఈ స్పెయిన్‌ బుల్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో సెట్లో మొదటి రెండు పాయింట్లు సాధించి రూడ్‌ జోరు చూపించాడు. కానీ అతడి దూకుడు ఎంతోసేపు సాగలేదు. ఆపై అద్వితీయంగా పుంజుకున్న రఫా.. రూడ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆఖరి సెట్‌లో మరింత విజృంభించిన ఈ ఐదో సీడ్‌ 6-0తో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎర్రమట్టి కోర్టు పోరులో ఇప్పటికి 14 సార్లు ఫైనల్‌ చేరగా అన్ని సార్లు టైటిల్‌కు గెలుపొందాడంటే.. రోలాండ్‌ గారోస్‌లో అతడి పోరును అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం.1 ఇగా స్వైటెక్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌ పోరులో స్వైటెక్‌ (పోలెండ్‌) కోకో గాఫ్‌(అమెరికా)పై 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన స్వైటెక్‌ ఈ పోరును కేవలం 68 నిమిషాల్లోనే ముగించడం విశేషం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని