ఫీల్డింగ్‌ చేస్తూ జెర్సీ మార్పు.. బంతి బౌండరీకి

అబుదాబి టీ10 లీగ్‌లో సోమవారం అరుదైన, హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. బహుశా క్రికెట్‌లో ఇంతకుముందెన్నడూ ఇలా జరిగి ఉండకపోవచ్చు...

Updated : 02 Feb 2021 11:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి టీ10 లీగ్‌లో సోమవారం అరుదైన, హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగానే ఓ క్రికెటర్‌ మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తూ జెర్సీ మార్చుకుంటున్న వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో బ్యాట్స్‌మన్‌ ఆడిన షాట్‌కు బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో ఆ ఫీల్డర్‌ అలాగే పరుగెత్తి అందర్నీ నవ్వించాడు. ఆ విశేషాలేంటో మీరే తెలుసుకోండి..

సోమవారం సాయంత్రం నార్తన్‌ వారియర్స్‌, టీమ్ అబుదాబి జట్ల మధ్య 14వ లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా అబుదాబి ఆటగాడు రోహన్‌ ముస్తాఫా (యూఏఈ అంతర్జాతీయ ఆటగాడు) ఫీల్డింగ్‌ చేస్తూనే జెర్సీ మార్చుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో నార్తన్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ ముహ్మద్‌ (76;34 బంతుల్లో 7x4, 6x4) ఆడిన షాట్‌కు బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో.. అది చూసిన రోహన్‌ ఒంటిపై సగం ధరించిన జెర్సీతోనే పరుగులు తీశాడు. దీంతో అక్కడున్న ఆటగాళ్లంతా సరదాగా నవ్వుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజెన్లు సైతం చూసి ఆనందిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ అబుదాబి ‌10 ఓవర్లలో 123/3 స్కోర్‌ సాధించింది. లూక్‌రైట్‌(33), జోక్లార్క్‌(50), డకెట్‌(31) రాణించారు. ఆపై నార్తన్‌ టీమ్‌ ఓపెనర్లు లెండిల్‌ సిమన్స్‌(37), వసీమ్‌ మహ్మద్‌(76) చెలరేగడంతో రెండువికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. 

ఇవీ చదవండి..
ఇంగ్లాండ్‌ ఒక్క టెస్టులోనైనా గెలుస్తుందనుకోవట్లేదు
మా విజయంలో ద్రవిడ్‌ది కీలక పాత్ర: రహానె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని